
విద్యార్థుల్లో అభ్యసన కొరవడింది
నెక్కొండ: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు కొరవడ్డాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. నెక్కొండ హైస్కూల్‌ను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె మెనూ ప్రకారం భోజనం అందించడంలేదని మధ్యాహ్న భోజన ఇన్‌చార్జ్ టీచర్ శ్రీదేవిపై మండిపడ్డారు. విద్యార్థులకు సరిపడా భోజనం తయారు చేయకపోవడంతో భోజన ఏజెన్సీ మార్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. విద్యార్థులతో ఇంగ్లిష్, తెలుగు, హిందీ పాఠ్యశాంశాలను చదివించారు. సబ్జెక్ట్‌ల వారీగా ఉపాధ్యాయులతో పాఠాలు చదివించారు. (ఏఐ) ఆర్టిఫిసియల్ ఇంటెలిజెంట్స్ ద్వారా విద్యాబోధన అందించాలని ఆమె ప్రధానోపాధ్యాయుడు రంగారావును ఆదేశించారు. అంతకు ముందు అప్పల్‌రావుపేట ఊర చెరువు, వెంకటాపురం పెద్ద చెరువును కలెక్టర్ సందర్శించారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే 1800 425 3424 నంబరు ద్వారా సమాచారం అందించాలన్నారు.
పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలి
న్యూశాయంపేట: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంబంధిత పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ముంపు నివారణలో భాగంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వద్ద నిర్మిస్తున్న నాలా పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వనమహోత్సవంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యల్లో వేగం పెంచాలని తెలిపారు. భద్రకాళి పూడికతీత పనులపై సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు పరిహారం త్వరగా చెల్లించాలని ఆదేశించారు. పైడిపల్లి, వర్ధన్నపేటల్లో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు
వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద అన్నారు. పాఠశాలలు, వసతిగృహాల్లో అధికారుల సందర్శన, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వనమహోత్సవం, విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలు, తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సమీక్షించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకోవాలన్నారు. రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టె ఉండేలా పర్యవేక్షిస్తూ మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్ల సహకారంతో పరిశీలించాలన్నారు.
నెక్కొండ హైస్కూల్‌లో కలెక్టర్ సత్యశారద తనిఖీ
మెనూ పాటించడంలేదని ఆగ్రహం
విద్యార్థులతో కలిసి
భోజనం చేసిన కలెక్టర్