ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
ఎల్కతుర్తి: రానున్న రెండు, మూడు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో సత్తా చాటాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని వెంకటసాయి గార్డెన్‌లో జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో, ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సత్యసాయి గార్డెన్‌లో జరిగిన ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి హాజరై మాట్లాడారు. కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్లు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టినట్‌లైతే కేటీఆర్ మాటలను పిటిషన్‌గా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీబీఐ ద్వారా లేదా ఇతరత్రా శాఖల ద్వారా విచారణ జరిపించాలన్నారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై అపనింద మోపుతున్నాడని మండిపడ్డారు. ప్రాజెక్టులను నిర్మించడంలో బీఆర్‌ఎస్ విఫలమైతే ఆ చెడ్డ పేరును కాంగ్రెస్‌పైనే రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులను కూల్చే చరిత్ర కాంగ్రెస్‌కు లేదన్నారు. కేటీఆర్ మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గత ప్రభుత్వ పథకాలను యథావిధిగా కొనసాగించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంటే శ్వేతపత్రం విడుదల చేసి క్రమశిక్షణతో రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశాల్లో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పరిశీలకుడు మాక్సూన్, పీసీసీ సభ్యుడు అశోక్‌రెడ్డి, మండల అధ్యక్షులు చిట్టంపల్లి అయిలయ్య, ఇంద్రసేనారెడ్డి, నాయకులు సుకినె సంతాజీ, చంద్రశేఖర్‌గుప్తా, ఊసకోయిల ప్రకాశ్, కొ లుగూరి రాజు, ఆదరి రవి, చిదురాల స్వరూప, జ క్కుల అనిల్, గోలి రాజేశ్వర్‌రావు ఉన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్
ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాలు


