రైతుపై పోలీసుల జులుం!
వర్ధన్నపేట: వ్యవసాయ భూమిలో మట్టిని చదును చేస్తుండగా రైతును పోలీసులు బెదిరించిన సంఘటన ఆదివారం వర్ధన్నపేటలో జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన గాదె వెంకటయ్యకు శివాలయం వీధి సమీపంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. వరదతో ఈ భూమి కోతకు గురైంది. ఆ భూమిలోని మట్టిని కోతకు గురైన చోటుకు తరలించడానికి జేసీబీ, ట్రాక్టర్లను అద్దెకు తీసుకొచ్చాడు. ఎలాంటి అనుమతి లేకుండా మట్టి, మొరాన్ని తరలిస్తున్నావని పోలీసులు వచ్చి రైతును బెదిరించారు. మట్టి, మొరాన్ని బయటకు తరలిస్తే నేరం అవుతుందని, తన పొలంలోని మట్టితో చదును చేసుకుంటుంటే ఎలా నేరం అవుతుందని సదరు రైతు ప్రశ్నించడంతో కంగుతిన్న పోలీసులు చేసేదేమి లేక వెనుదిరిగారు. రైతును బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు పోలీసులు ఇలా చేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై ఎస్సై రాజును వివరణ కోరగా చెరువు నుంచి మట్టి, మొరం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను పంపించాను. పొలంలోని మట్టితోనే రైతు చదును చేసుకుంటున్నట్లు గమనించారు. కానిస్టేబుళ్లు ఎవరిని బెదిరించలేదని పేర్కొన్నారు.
వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా బెదిరింపులు


