చెరుకు టన్నుకు రూ.6 వేలు ధర చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

చెరుకు టన్నుకు రూ.6 వేలు ధర చెల్లించాలి

Oct 9 2026 12:26 AM | Updated on Oct 9 2026 12:26 AM

కొత్తకోట రూరల్‌: చెరుకు టన్నుకు రూ.6 వేలు గిట్టుబాటు ధర చెల్లించాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ చెరుకు రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ డీజీఎం నాగార్జునరావును కలిసి చెరుకు రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యం సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో చెరుగు సాగు గణనీయంగా పెరిగిందన్నారు. 2025–26లో 4,600 ఎకరాలు ఉన్న సాగు.. 2026–27 నాటికి 10,400 ఎకరాలకు చేరిందని తెలిపారు. 2025–26 సీజన్‌లో టన్నుకు 3,810 చెల్లించారని, అలాగే ఆర్‌–1 కేటగిరీకి టన్నుకు రూ.350, ఆర్‌–2 కేటగిరికి రూ.400 చొప్పున అదనంగా చేర్చి రైతులకు మొత్తం రూ. 4,210 ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ ఏడాది టన్నుకు రూ. 6 వేల మద్దతు ధరతో పాటు ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున రూ.వెయ్యి బోనస్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాక్టరీకి పంట పంపిన 14 రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని.. ఎకరాకు రూ.30 వేలు పరిశ్రమ ద్వారా రుణాలు ఇవ్వాలని, గ్రామాల్లో సీడీసీ నుంచి రహదారుల మరమ్మతు చేపట్టాలని, కొత్తకోట నుంచి ఫ్యాక్టరీ వరకు రోడ్లు మరమ్మతు చేయాలన్నారు. రవాణా సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం బాధ్యతగా స్వీకరించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో బోర్లలో నీటిమట్టం తగ్గిందని.. కోతలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వినతిపత్రం అందజేసిన వారిలో తెలంగాణ చెరుకు రైతు సంఘం జిల్లా నాయకులు జీఎస్‌ గోపి, తిరుమలేష్‌, ఎస్‌.అరుణ్‌కుమార్‌, సుధాకర్‌రెడ్డి, ముని, రవి నాయక్‌, బుచ్చిరెడ్డి, హన్మంతు, నాగరాజు, రెడ్యానాయక్‌, శ్రీను, ఎల్లన్న, పి.రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement