వనపర్తి రూరల్: మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత నిర్ణీత స్టాప్‌లు కాకుండా ఎక్కడపడితే అక్కడ నిలపడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తమ సమస్యలు పరిష్కరించే వరకు బస్సులు నడపబోమంటూ శనివారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసి డిపో వద్ద ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్లు బస్సులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్కెక్కి డోర్ల వద్ద వేలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగితే తమనే బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సులకు సైతం అదనపు స్టాప్‌లు ఏర్పాటు చేయడంతో మైలేజీ తగ్గుతోందని.. దీంతో బస్సు యజమానులతో సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. స్టాప్‌ల వద్ద బస్సులు నిలపకపోతే డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేస్తున్నారని.. ఓ వైపు ప్రయాణికులు, మరోవైపు అధికారుల ఒత్తిళ్లతో విధులు నిర్వర్తించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించి విధుల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ డీఎం దేవేందర్‌గౌడ్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి విధులకు హాజరయ్యారు.


