● రైతుబీమాను తుంగలో తొక్కి
కాంగ్రెస్ వెయ్యిరోజుల సంబరాలు
● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
అమరచింత: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుల సంక్షేమానికి తీసుకొచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ రైతులతో కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పురవీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎల్‌నినో పేరిట రైతులకు సాగునీరు సరఫరా చేయకుండా ఆంక్షలు విధిస్తున్నారని.. వరి సాగు వద్దని చెబుతున్న ప్రభుత్వం ఇకపై ఆరుతడి పంటల సాగు కూడా చేయవద్దని చెప్పడం ఖాయమన్నారు. ఎన్నికల సమయంలో 420 హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేయలేని స్థితిలో ఉందని తెలిపారు. తమ పాలనలో వ్యవసాయానికి నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ను అందించామని.. ప్రస్తుత ప్రభుత్వం రోజుకు 9 గంటల విద్యుత్‌ను కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు. రైతుబీమా పథకాన్ని అమలు చేయలేక మంగళం పాడిందని తెలిపారు. అమాయక ప్రజలకు ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో సాధించామని వెయ్యి రోజుల పండుగ చేసుకోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు.


