ఏదుల ఉండగా..గొల్లపల్లి అనవసరం | - | Sakshi
Sakshi News home page

ఏదుల ఉండగా..గొల్లపల్లి అనవసరం

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

కమీషన్ల కోసమే రిజర్వాయర్‌ నిర్మాణానికి ఆసక్తి

లగచర్ల పునరావృతం

అవుతుంది..

రైతులు వద్దన్నా.. గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తే లగచర్ల ఘటన పునరావృతం అవుతుందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. వంద రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులు దీక్షలు చేపడితే పట్టించుకోని కాంగ్రెస్‌ పాలకులు.. రైతుల దీక్ష విరమింపజేసేందుకు హరీశ్‌రావు వస్తున్నారనగానే ఉలిక్కిపడుతున్నారన్నారు. బాలికపై అత్యాచార యత్నం, రైతుల దీక్షలపై జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. ఏదుల రిజర్వాయర్‌ నిర్మాణానికి రైతులను ఒప్పించేందుకు 73 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించానని, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించేందుకు కాళ్లు మొక్కుతానని ప్రాధేయపడినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎత్తైన ప్రాంతాలకు నీరందించేలా మినీ లిఫ్టులు సైతం ఏర్పాటు చేశామని వివరించారు. కేవలం రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా డిజైన్‌ చేసిన కేఎల్‌ఐ ప్రాజెక్టును నాలుగు లక్షల ఎకరాలకు నీరందించేలా ఆధునికీకరించామన్నారు.

వనపర్తి/గోపాల్‌పేట: దశాబ్దాల పాటు ఆంధ్రా పాలకులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం రూ.నాలుగు వేల కోట్లతో నిర్మించి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని.. కాంగ్రెస్‌ పాలకులు ఏడు దశాబ్దాల కాలంలో కేవలం 25 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులను నిర్మిస్తే, కేవలం తొమ్మిదేళ్లలో 65 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మించిన ఘటన కేసీఆర్‌ సర్కార్‌దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఏదుల మండలం గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం వద్దంటూ రైతులు 102 రోజులుగా రిలే దీక్షలు చేపడుతుండగా.. గురువారం ఆయన గ్రామానికి వచ్చి రైతుల దీక్షకు మద్దతు తెలిపి మీ వెంట మేముంటామంటూ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని ఆరోపించారు. రైతులు దీక్ష చేస్తున్నదిక్ష రాజకీయాల కోసం కాదని అధికార పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. ఏడు టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్‌ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్‌ అవసరం లేదని 2018లోనే నాటి కేసీఆర్‌ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏదుల రిజర్వాయర్‌ నిర్మాణ సమయంలో కేఎల్‌ఐ ఆయకట్టు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఓటీ (తూము) ఏర్పాటు చేసేలా సప్లిమెంటరీ డిజైన్‌ చేశామన్నారు. పాన్‌గల్‌, వనపర్తి, కోడేరు మండలాల రైతులకు ఉపయోగపడే రామన్నగట్టు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా రద్దుచేసి అవసరం లేని గొల్లపల్లి రిజర్వాయర్‌ను కమీషన్ల కోసం రూ.1,300 కోట్లతో నిర్మించ తలపెట్టిందని ఆరోపించారు. నల్లమల పులిని అంటూ డైలాగులు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారని ప్రశ్నించారు. ఇప్పటికే జూరాల, భీమా సాగునీటి కాాల్వల కింద యాసంగిలో క్రాప్‌ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు ఉన్నాయని.. జూరాల వద్ద మరో ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమన్నారు. వేసవిలోనూ పంపులు నడిచేందుకు నీరుండే శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రాకు వదిలేసి అతి తక్కువ సామర్థ్యం ఉన్న జూరాల వద్ద ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు.

వలసల జిల్లా సస్యశ్యామలం..

8 నెలల్లో తుమ్మిళ్ల పూర్తి చేసి చూపించాం

సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు అందుబాటులోకి..

మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

రైతులతో దీక్ష విరమింపజేసిన బీఆర్‌ఎస్‌ నేతలు

వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు తెలంగాణ ప్రభుత్వ హయాంలో సస్యశ్యామలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. వలసలు తగ్గించేందుకు అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసిందని, కుల వృత్తులకు జీవకళ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్‌ పాలకులు అక్రమ కేసులతో బీఆర్‌ఎస్‌ నాయకులను బెదిరింపులకు గురిచేయలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement