హే..కృష్ణా.! | - | Sakshi
Sakshi News home page

హే..కృష్ణా.!

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

శ్రీశైలం డ్యాంలో శరవేగంగా తగ్గుతున్న నీటిమట్టం

ప్రస్తుతం మిగిలింది 42 టీఎంసీలే

మరో వారం, పది రోజుల్లో కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం

జూరాలలోనూ అడుగంటిన జలాలు

వేసవిలో ఇబ్బందులు తప్పించేందుకు చర్యలు శూన్యం

అడుగంటిన జూరాల..

ఇప్పటికే జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్‌ స్టోరేజీ స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.074 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.367 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. దీంతో తాగునీటి అవసరాలకు సైతం కటకట ఏర్పడనుంది. గతేడాది సైతం జూరాలలో నీటినిల్వ డెడ్‌ స్టోరేజీకి చేరుకోగా.. ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. కర్ణాటకలోని నారాయణపూర్‌ జలాశయం నుంచి జూరాలకు తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ నీటిని సరఫరా చేశారు. ఈ సారి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తేనే తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం వేగంగా అడుగంటుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం పెరగడంతో, ఈ సారి వేసవి ప్రారంభంలోనే నీటినిల్వ అట్టడుగు స్థాయికి చేరుకుంటోంది. శ్రీశైలం డ్యాం నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 42.408 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ఇరు రాష్ట్రాలు జలవిద్యుదుత్పత్తితో పాటు సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం వినియోగిస్తుండటంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవి చివరి నాటికి తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

డెడ్‌ స్టోరేజీకి చేరువగా..

శ్రీశైలం డ్యాంలో 20 రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. రెండు, మూడు రోజులకు ఒక టీఎంసీ చొప్పున నీరు అడుగంటుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని కేఎల్‌ఐ ప్రాజెక్ట్‌కు నీటి విడుదల కొనసాగడం.. గత నెల 22 వరకు భూగర్భ జలవిద్యుత్‌ ఉత్పత్తి చేపట్టడంతో నీటిమట్టం వేగంగా తగ్గింది. ప్రస్తుతం డెడ్‌ స్టోరేజీకి చేరువగా ఉండటంతో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. గతనెల 15వ తేదీ వరకు 75 టీఎంసీల నీటిమట్టం ఉండగా.. ప్రస్తుతం 42 టీఎంసీలకు పడిపోయింది. వేసవికాలం ముగిసేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉండటం.. జూలై వరకు శ్రీశైలం ప్రాజెక్టు వరద వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

పోటాపోటీగా నీటి వినియోగంతో..

గత మార్చి ప్రారంభానికి ముందు శ్రీశైలం రిజర్వాయర్‌లో 92 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉండగా.. ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా నీటి తరలింపు చేపట్టారు. ఫిబ్రవరి చివరి వారం, మార్చి నెలలో నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. ఏపీలోని విద్యుదుత్పత్తి కేంద్రానికి నిత్యం సగటున 10వేల క్యూసెక్కులతో పాటు హంద్రీనీవా సుజలాస్రవంతి, కేసీసీ, పీఆర్‌పీ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేశారు. అలాగే తెలంగాణలోని భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రానికి సగటున 8 వేల క్యూసెక్కులతో పాటు ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్ట్‌కు నీటి సరఫరా కొనసాగింది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..

వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీశైలం డ్యాంలో కనిష్ట నీటిమట్టానికి ముందే కేఎల్‌ఐ కింద రిజర్వాయర్లను నింపుతున్నాం. అవసరం మేరకు నీటినిల్వ చేపట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాస్‌రెడ్డి,

ఇరిగేషన్‌శాఖ ఈఈ, నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement