రూటు మారింది.. | - | Sakshi
Sakshi News home page

రూటు మారింది..

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

అటకెక్కిన దశాబ్దాల

నాటి ప్రతిపాదన

జిల్లాలోని గోపాల్‌పేట, వనపర్తి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్‌ మీదుగారైల్వే లైన్‌ ఏర్పాటు

సరుకు రవాణా దృష్ట్యా మార్పులు

వనపర్తి: కేంద్ర రైల్వేశాఖ ఇటీవల చేసిన సర్వే ఆధారంగా డోర్నకల్‌–గద్వాల రైల్వే లైన్‌ ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. దీంతో నిజాం కాలం నాటి మాచర్ల–రాయచూరు రైల్వే లైన్‌ ప్రతిపాదన పక్కనబెట్టినట్లు అయింది. జిల్లా విషయానికొస్తే.. మునుపు దేవరకొండ, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, కడుకుంట్ల, పెబ్బేరు, ఇటిక్యాల మీదుగా గద్వాల జంక్షన్‌ను కలిపేలా ప్రతిపాదన ఉండింది. నాటి నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు అనంతరాములు హయాంలో ఈ ప్రతిపాదనపై గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం దక్కలేదు. తాజాగా మారిన పరిణామాలు కృష్ణానదిపై మరో రైల్వే వంతెన నిర్మాణం చేయాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న దానిని అనుసంధానిస్తూ, సరుకు రవాణాను దృష్టిలో ఉంచుకొని డోర్నకల్‌–గద్వాల రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైతేనేం ఎట్టకేలకు వనపర్తి ప్రాంతానికి రైల్వే సౌకర్యం వస్తుందనే వారు కొందరైతే.. మునుపటి ప్రతిపాదన ప్రకారమే రైల్వే లైన్‌ నిర్మాణం చేపడితే బాగుంటుందనే భావన మరికొందరి నుంచి వినిపిస్తోంది.

జిల్లాలో ఐదు స్టేషన్లేనా..?

ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గాన్ని తాకుతూ నాగర్‌కర్నూల్‌ మీదుగా వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని చెన్నూరు, చిట్యాల శివారులోని చేయూత అనాథ ఆశ్రమం సమీపం నుంచి అచ్యుతాపురం శివారు రాజపేట, కొత్తకోట మీదుగా అజ్జకొల్లు, శ్రీరాంనగర్‌ స్టేషన్‌ను అనుసంధానిస్తూ గద్వాలకు చేరుకోనున్నట్లు ప్రస్తుతం రైల్వేశాఖ విడుదల చేసిన మ్యాపింగ్‌ సర్వే ఆధారంగా తెలుస్తోంది. మరికొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తున్న తరుణంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలనే ప్రయత్నంలో ప్రస్తుత ఎంపీ మల్లు రవి ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా సోమవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ను కలిసి డోర్లకల్‌–గద్వాల రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ మ్యాప్‌ను అధికారికంగా స్వీకరించారు. సమీప భవిష్యత్తులో ఈ రైల్వే లైన్‌ ప్రాముఖ్యతను నాగర్‌కర్నూల్‌, వనపర్తి ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలు వివరించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం..

డోర్నకల్‌–గద్వాల రైల్వే లైన్‌ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. త్వరలో పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. కేంద్రం రైల్వేశాఖకు బడ్జెట్‌లో రూ.2.93 లక్షల కోట్లు కేటాయించగా.. ఇందులో 296 కిలోమీటర్ల డోర్నకల్‌–గద్వాల రైల్వే లైన్‌ నిర్మాణానికి రూ.5,330 కోట్లు కేటాయించింది. తొలి విడత ప్రాధాన్యతగా నిధులు విడుదల చేయించి పనులు పూర్తి చేయించేందుకు ప్రయత్నం చేస్తాం. – మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement