వనపర్తి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీఅరైవ్.. అలైవ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం సాయంత్రం కార్యక్రమ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 13వ తేదీన గ్రామాల్లో రోడ్డు భద్రతకు కమిటీలు వేసి గ్రామసభలు నిర్వహించి రహదారి నిబంధనలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు గుర్తించి ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. వారం పాటు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేలా విద్యార్థులతో ర్యాలీలు, మండలస్థాయి కార్యక్రమాలు, వాహన చోదకులు, డ్రైవర్లకు కంటి పరీక్షలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అన్ని కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగ్యస్వాములను చేయాలన్నారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏప్రిల్ 14న స్థానిక అంబేడ్కర్ విగ్రహం దగ్గర ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. 16వ తేదీన మండలస్థాయిలో కార్యక్రమాలు, జిల్లాలో ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించని వారికి చలానాలు కఠినంగా విధించాలని ఆదేశించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించే వారిని ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, ఆర్‌అండ్‌బీ డీఈ దేశ్యానాయక్, ఇన్‌చార్జ్ జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డీటీఓ మానస, డీపీఓ రఘునాథ్, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


