వరి కోతలు షురూ..
జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో ప్రారంభం 
● కూలీల కొరతతో
యంత్రాలకు పెరిగిన డిమాండ్
● జిల్లాలో 2,09,835 ఎకరాల్లో
పంట సాగు
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వతో పాటు బోరుబావులు, చెరువులు, రిజర్వాయర్ల కింద సాగు చేసిన వరి సకాలంలో చేతికందడంతో రైతన్నలు పంట కోతలకు శ్రీకారం చుట్టారు. ఈసారి వానాకాలంలో అధిక వర్షాలు కురవడంతో అక్కడక్కడ పంటలకు తెగుళ్లు సోకినా.. దిగుబడి మాత్రం ఆశించిన మేర పొందుతున్నారు. కూలీల కొరత కారణంగా చాలావరకు కోత యంత్రాలను వినియోగించి నూర్పిళ్లు పూర్తిచేసి మార్కెట్‌కు తరలించే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. వారం నుంచి పంట కోతలు ప్రారంభం కావడంతో యంత్రాలకు కూడా డిమాండ్ పెరిగింది.
ఫ జిల్లాలోని 15 మండలాల పరిధిలో 2,09,835 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అతివృష్టి కారణంగా పంటలు చేతికందుతాయో లేదోనని ఆందోళన చెందిన రైతులు నష్టాన్ని అధిగమించినా.. కూలీల కొరతతో వరి కోతలకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించే పరిస్థితి దాపురించింది. వరి, పత్తి పంటలు ఒకేసారి రావడంతో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరిగిందని.. తప్పని పరిస్థితుల్లో రోజువారి కూలి రూ.450 నుంచి రూ.500 చెల్లించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
పెరిగిన పెట్టుబడులు..
వరిసాగు ఎకరాలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి అయినట్లు రైతులు చెబుతున్నారు. వరి కోత యంత్రానికి ప్రస్తుతం గంటకు రూ.2,500 ఉండగా.. ఎకరా కోతకు రెండు గంటల సమయం పడుతుండటంతో రూ.5,200 ఖర్చవుతుందని తెలిపారు. దీనికితోడు కోసిన ధాన్యాన్ని కల్లాలకు తరలించేందుకు ట్రాక్టర్ అద్దె ట్రిప్పునకు రూ.600 వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ.2,380తో పాటు బోనస్ రూ.500 చెల్లిస్తామని ప్రకటించడంతో త్వరగా మార్కెట్‌కు తరలించే పనుల్లో లీనమయ్యారు.
మండలం విస్తీర్ణం
(ఎకరాల్లో..)
కొత్తకోట 20,510
పాన్‌గల్ 19,580
ఆత్మకూర్ 16,040
పెద్దమందడి 18,600
పెబ్బేరు 17,618
ఖిల్లాఘనపురం 16,430
వనపర్తి 15,600
వీవనగండ్ల 15,200
మదనాపురం 14,863
గోపాల్‌పేట 13,325
అమరచింత 10,120
శ్రీరంగాపురం 8,980
చిన్నంబావి 8,060
ఏదుల 9,059
రేవల్లి 5,850
అమరచింత మండలం నందిమళ్లలో యంత్రంతో వరి కోత
మండలాల వారీగా వరి సాగు ఇలా..
ఎడమకాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలో వరి కోతల పండుగ మొదలైనట్టుంది. ఈసారి ఆయకట్టు రైతులు 85 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎగువన కురిసిన వర్షాల కారణంగా జలాశయానికి భారీగా వరద రావడంతో ఆయకట్టుకు పూర్తిస్ధాయిలో సాగునీరు అందించారు. దీంతో రైతులు అత్యధికంగా వరి సాగు చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
