1,075 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
● పక్కా సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు
● ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన సోదాలు
కల్వకుర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలని సంకల్పంతో రేషన్ షాపుల ద్వారా ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్నబియ్యం సైతం పక్కదారి పట్టిన సంఘటన కల్వకుర్తి మండలంలో వెలుగుచూసింది. సన్నబియ్యంతోపాటు దొడ్డు బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం రావడంతో రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆదివారం మండలంలోని మార్చాల సమీపంలో ఉన్న శ్రీకృష్ణ రైస్‌మిల్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించగా.. 1,075 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు ఇవి రేషన్ బియ్యం కావని చెప్పినప్పటికీ అధికారులు వారి మాటలను పట్టించుకోలేదు. మిల్లుకు నాలుగేళ్లుగా సీఎమ్మార్ వడ్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. అయినా మిల్లులో ఎఫ్‌ఆర్‌కే బియ్యం దర్శనం ఇవ్వడంతో అవి రేషన్ బియ్యం అని అధికారులు తేల్చారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో పడ్డారు.
రాత్రి 10 గంటల వరకు..
రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు మిల్లుకు చేరుకున్నారు. ఆ సమయంలో మిల్లు మూసి ఉండగా సంబంధిత యజమాని గుమాస్తాలతో మిల్లు తెరిపించారు. దీంతో ఏఎస్పీ వెంకటేశ్వర్లు టెక్నికల్ సిబ్బందితోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు, డీఎం రాజేందర్‌ను మిల్లు వద్దకు రప్పించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సోదాలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రేషన్ బియ్యాన్ని వివిధ వాహనాల ద్వారా వేరే మిల్లుకు తరలించారు. మిల్లు గుమా స్తాలను అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పా రు. మిల్లు యజమాని సంబు రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశామని డీఎం రాజేందర్ తెలిపారు.


