విశాఖపట్నం: స్థానిక ద్వారకా బస్స్టేషన్ ముఖద్వారం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని మంగళవారం రాత్రి ఓ తాపీమేస్త్రి మృతి చెందాడు. దీనిపై టూటౌన్ ట్రాఫిక్ ఎస్సై సింహాచలం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బూర్జవలసకు చెందిన వి.చంద్ర(51) భార్య సీతతో కలిసి సీతంపేటలో మేస్త్రి పని ముగించుకుని కేజీహెచ్ సమీపంలోని ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 7.45 గంటల సమయంలో గాజువాక నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కు వస్తున్న 38ఎన్ బస్సు చంద్రను ఢీకొంది. దీంతో ఆయన బస్సు వెనుక చక్రం కింద పడిపోగా, చక్రం తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడంతో సీత కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్సై సింహాచలం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. భార్య సీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


