రామభద్రపురం: మండలంలోని నాయుడువలసలో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన రైతులకు చెందిన మినీ గోకులాల నిర్మాణాలకు అధికారులు చర్యలు చేపట్టారు. కూటమి పాలనలో పాలకులు, అధికారులు పాడిరైతులపై వివక్ష చూపుతున్నారు. అధికారులు స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి రాజకీయాలు చేస్తూ వైఎస్సార్సీపీ మద్దతుదారు పాడి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఈ నెల 12వ తేదీన ‘ఇదేం పాడి పని’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు రాజకీయాలకతీతంగా పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని తక్షణమే పాడిరైతులకు మంజూరు చేసిన మినీ గోకులాల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మండల వీబీజీ రాంజీ అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీవో త్రినాథరావు, టెక్నికల్ అసిస్టెంట్ నటరాజ్లు నాయుడువలస గ్రామానికి వెళ్లారు.అక్కడ నిలిపేసిన వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన పాడిరైతులు కేతిరెడ్డి సూర్యనారాయణ, అంబటి శ్రీనివాసరావులకు చెందిన మినీ గోకులాల నిర్మాణాలకు మార్కింగ్ ఇచ్చి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆయా రైతులు ఆనందం వ్యక్తంచేస్తూ సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.


