మక్కువ: మక్కువ మండలాన్ని గడిచిన పది రోజులుగా ఏనుగుల గుంపు వదలడం లేదు. మండలంలోని పలు గ్రామాల సమీపంలో నదులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో పాటు, ఆయిల్ పామ్ తోటలు, జీడితోటలు, ఎత్తైన కొండలు ఉన్నందున సేదదీరుతూ సంచరిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున మక్కువ, డబ్బూరివలస గ్రామ సమీపాల్లోని వరిపంట పొలాల గట్లపై నుంచి చెరువుకు చేరుకున్నాయి. చెరువులో సేదదీరుతున్న ఏనుగుల గుంపును చూసేందుకు మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. ఏనుగులు ప్రజలకు ఎటువంటి హాని చేయకుండా అటవీ శాఖ సిబ్బంది, ట్రాకర్స్ చర్యలు చేపట్టారు. చెరువులో సేదదీరిన ఏనుగుల గుంపు, కొంత సమయం పోయిన తర్వాత సువర్ణముఖి నదిలోకి జారుకున్నాయి.
ఆందోళనలో ప్రజలు
రెండు రోజులుగా మార్కొండ పుట్టి, సరాయవలస పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో ఏనుగులు సంచరించడంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ ఏనుగులు గ్రామాల సమీపంలో సంచరిస్తుండడంతో, ఏ హాని తలపడతాయోనని బిక్కుబిక్కు మంటూ ఉన్నారు. వారం రోజుల క్రితం వరకు పంట పొలాల్లో సంచరించిన ఏనుగుల గుంపు, పంథా మార్చి, జనావాసాల్లోకి వస్తుండడంతో ఏం జరుగుతుందోనని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను చూసేసరికి ప్రజలు గట్టిగా కేరింతలు కొట్టడంతో, ఏనుగులు విసుగుచెంది జనావాసాల్లోకి చొరబడితే పెద్ద నష్టం జరిగే ఆస్కారం ఉంటుంది. ఏనుగులను రెచ్చగొట్టే ధోరణలో ప్రజలెవరూ వ్యవహరించరాదని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా బంద్
ఏనుగులు సంచరిస్తున్న గ్రామాల సమీపంలోని పంట పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎండలు అధికంగా ఉండడం, వర్షాలు కురవకపోవడంతో, పంటలు ఎండిపోతున్నాయి. వ్యవసాయ మోటార్ల ద్వారా పంట పొలాలకు నీరు అందించేందుకు, ఏనుగులు తిరిగే ప్రదేశంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో, పంటలకు నీరు అందించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఏనుగుల గుంపును తరలించేలా చర్యలు చేపట్టాలని మక్కువ మండల ప్రజలు కోరుతున్నారు.
భయాందోళనకు గురి చేస్తున్న ఏనుగుల గుంపు
చూసేందుకు తరలివచ్చిన ప్రజలు
నిలిచిపోతున్న విద్యుత్ సరఫరా
ఆందోళనలో అన్నదాతలు


