పార్వతీపురం రూరల్: విజయవాడలోని జగ్గయ్యపేట ఏసీఎస్ కళాశాల వేదికగా నిర్వహించిన జాతీయస్థాయి థాంగ్–టా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా యువకుడు శనపతి వినయ్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. అండర్–19 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని గెలుపొందాడు. పార్వతీపురం పట్టణంలోని వివేకానంద కాలనీ ఉజ్జిడితల్లి వీధికి చెందిన శనపతి చంద్రరావు, సంధ్యారాణి దంపతుల కుమారుడు వినయ్ కుమార్. కోచ్ ఎస్.మురళి వద్ద మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందాడు. జాతీయస్థాయిలో స్వర్ణ పతకం సాధించి జిల్లాకు గుర్తింపు తెచ్చిన వినయ్ను తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ప్రోత్సహించారు.


