పార్వతీపురం రూరల్: అరుణోదయ యూనివర్సిటీ పరిశోధన మార్గదర్శకుడు, స్టూడెంట్ సక్సెస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ శంకరరావు కోచెర్లకు ‘డాక్టర్ ఏపీజే. అబ్దుల్ కలాం జాతీయ విద్యావేత్త పురస్కారం’ లభించింది. విద్యారంగంలో ఆయన చేసిన కృషి, పరిశోధనా మార్గదర్శకత్వానికి గుర్తింపుగా వెల్రెడ్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందించింది. ఈ పురస్కారానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని ఫౌండేషన్ డైరెక్టర్ శ్రబానీ కాయేత్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో (సెక్షప్ 8 కింద) నమోదైన ఈ లాభాపేక్షలేని సంస్థ, డాక్టర్ శంకరరావు వత్తిపరమైన అంకితభావాన్ని, విద్యార్థుల సాధికారతకు ఆయన చేస్తున్న సేవలను పత్రంలో పొందుపరిచింది. యువతలో విద్యావగాహన, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ద్వారా సామాజిక అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా ఫౌండేషన్ పేర్కొంది.
పైడితల్లి జాతరకు
100 ప్రత్యేక బస్సులు
విజయనగరం అర్బన్: దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం విజయనగరం నుంచి విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం, రాజాం, ఎస్.కోట తదితర ప్రాంతాలకు సుమారు 100 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పండగ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అదేవిధంగా విజయనగరానికి చెందిన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీపైడితల్లమ్మ జాతర సందర్భంగా వివిధ డిపోల నుంచి 100కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు రవాణా ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేరకు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
● ఊబర్, ఓలా, ర్యాపిడోలను
రద్దు చేయాలి
విజయనగరం గంటస్తంభం: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఊబర్ ఓలా, ర్యాపిడోలను రద్దుచేసి ప్రభుత్వమే యాప్ను తీసుకురావాలని, శ్రీ శక్తి పథకంతో నష్టపోయిన డ్రైవర్లకు తక్షణ సాయం కింద రూ.20000 ప్రకటించాలని కోరుతూ మంగళవారం విజయనగరం జిల్లా ఆటో – ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మొదటగా విజయనగరం కలెక్టరేట్ ఏవో ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ గేటు వద్ద ధర్నాకు అనుమతించక పోవడంతో కంటోన్మెంట్ పార్కు వద్ద ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎ. జగన్మోహన్రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ సంస్థల లాభాల కోసం పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ఆటో, క్యాబ్ డ్రైవర్ల పొట్టకొట్టి ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలకు అనుమతులతో పాటు పార్కింగ్ స్థలాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వైట్ బోర్డు వాహనదారులు సైతం యాప్ ద్వారా పాసింజర్ సర్వీస్ చేస్తున్నారని, వాటిని నియంత్రించాలన్నారు. శ్రీ శక్తి పథకంతో నష్టపోతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం రూ.20,000 ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2023, 24 నుంచి పెండింగ్లో ఉన్న ఈ చలానా కేసులు పూర్తిగా ఎత్తివేయాలని, క్యాబ్ లకు టోల్ చార్జీలు మినహాయింపు ఇవ్వాలని , ఒకే దేశం ఒకే పన్ను తరహాలో పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని, ఎల్లో బోర్డు వాహనాలకు రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేపడుతున్నామని డ్రైవర్లంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి, కార్యదర్శి బి.రమణ, ఆటో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్ ముత్యాలు, నాయకులు పాపారావు, రామునాయుడు, కూర్మారావు, ఈశ్వరరావు, లక్ష్మ ణరావు, డీఎల్ఎన్, సంతోష్, శివ తదితరులు పాల్గొన్నారు.


