తవ్వేద్దాం.. అమ్మేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

తవ్వేద్దాం.. అమ్మేద్దాం..

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

రాజాం:

రాజాం, పరిసర ప్రాంతాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ సంపాదనకు కాదేది అనర్హం అన్న చందంగా తవ్వకాలు చేపడుతున్నారు. ప్రశ్నించే రైతులు, పల్లె ప్రజలపై అధికార బలంతో బెదిరిస్తున్నారు. సాగునీటి చెరువులు, కొండలను కరగదీస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ గ్రావెల్‌ లోడును రూ.800లు నుంచి రూ.1500ల విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.

● రాజాం మండలంలో కొత్త కంచరాం, ఆగూరు, వీఆర్‌ అగ్రహారం తదితర ప్రాంతాల్లోని సాగునీటి చెరువుల్లో గ్రావెల్‌ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పాగుగార్రాజు చీపురుపల్లి, గోపాలపురం గ్రామాల్లోని చెరువుల్లో మట్టి రోజురోజుకూ మాయమవుతోంది. రాత్రి సమయాల్లో పొక్లెయిన్లతో తవ్వి విచ్చలవిడిగా తరలిస్తున్నారని, చెరువులు రూపుకోల్పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలే సహజవనరులను కొల్లగొడుతూ సొమ్ముచేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

● రేగిడి మండలంలో ఉంగరాడమెట్ట వద్ద ఓ కొండను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారు. ఇప్పటికే కొండలో సగభాగం తరిగిపోయింది. పచ్చనేతలే మట్టి తవ్వకాల్లో ముందుండి నడిపిస్తున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా మిన్నకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

● వంగర, సంతకవిటి మండలాల్లోనూ పలుచోట్ల మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మట్టి తవ్వకాలు నిలుపుదలచేయాలని, అక్రమ గ్రావెల్‌ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement