● నేడు జేఏసీ సన్నాహక సదస్సు
విజయనగరం అర్బన్: ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనే ధ్యేయంగా ఉద్యోగ సంఘాల జేఏసీ (విజయనగరం జోన్–1) ఉమ్మడి పోరాటానికి సిద్ధమైంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసేందుకు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘జేఏసీ ఉద్యమ సన్నాహక సదస్సు’ నిర్వహించనుంది. ఉద్యోగుల సమస్యలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్టీసీ పరిరక్షణ, ‘సీ్త్ర శక్తి’ పథకంలో పెరిగిన భారం– రక్షణ కరువు, 10 వేల ఖాళీల భర్తీ, ఆర్థిక హక్కుల సాధన, తదితర డిమాండ్‌లను వేదిక సాక్షిగా వినిపించనున్నాయి. రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. విజయనగరం జోన్‌లోని అన్ని జిల్లా, డివిజన్, డిపో, గ్యారేజీ కమిటీలు, నాన్ ఆపరేషన్ యూనిట్ ప్రతినిధులు, మహిళా నాయకులు, అన్ని స్థాయిల కార్యకర్తలు సకాలంలో హాజరై సన్నాహక సదస్సును జయప్రదం చేయాలని ఏపీ పీటీడీ విజయనగరం జోన్–1 ప్రతినిధులు పిలుపునిచ్చారు. ‘ఐక్యతే బలం– ఉద్యమమే మార్గం’ అనే నినాదంతో ఆర్టీసీ పరిరక్షణే లక్ష్యంగా సాగనున్న సదస్సుపై ఉద్యోగవర్గాలు శ్రద్ధ చూపుతున్నాయి.
సాగు పట్టాల కోసం పోరుబాట
వేపాడ: దశాబ్దాల కాలంగా, తాత ముత్తాత్తల నుంచి భూములు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాం.. సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ రాయితీలు వర్తింపజేయాలంటూ వేపాడ మండలం కొండగంగుబూడి పంచా యతీ పరిధిలోని గిరిజన గ్రామాల రైతులు సోమవారం ఆందోళన చేశారు. వేపాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి తమ ఆవేదనను అధికారులకు వినిపించారు. తక్షణమే పట్టాలు ఇవ్వాలంటూ నినదించారు. సమా ధానం చెప్పేవరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఉపతహసీల్దార్ రామకృష్ణ జిల్లా కేంద్రంలోని పీజీఆర్‌ఎస్‌లో పాల్గొన్న తహసీల్దార్ రాములమ్మతో మాట్లాడారు. ఆమె సూచనల మేరకు మూడు నెలల్లో భూములు సర్వేచేసి హక్కులు కల్పిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. నిరసన కార్యక్రమంలో కొండగంగుబూడి పంచాయతీ పరిధిలోని బంగార్యపేట, బందవలస, పాతవూరు, శొంఠివానిపాలెం, సారవానిపాలెం, కోటయ్యగరువు తదితర గ్రామాలకు చెందిన 60 కుటుంబాలు, ఏపీ రైతు సంఘం నాయకుడు చల్లా జగన్, సీపీఎం నాయకుడు చలూమూరి శ్యామ్, గిరిజన సంఘం నాయకుడు ఎస్.గంగులు తదితరులు పాల్గొన్నారు.


