విజయనగరం అర్బన్: జిల్లాలో సర్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. దీనిని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఓటరుకు ఫారం–2 పంపిణీ చేసి, వాటిని పూర్తిగా నింపించి బీఎల్‌ఓలకు అందజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఓటరు మ్యాపింగ్ అంతా 2002 ఓటరు జాబితా ఆధారంగానే జరుగుతోందని కలెక్టర్ గుర్తుచేశారు. 2002 సంవత్సరం తర్వాత ఓటరుగా నమోదైన వారు, ఆనాటి ఓటరు జాబితాలో తమ తండ్రి, తల్లి పేరు, సీరియల్ నంబర్‌ను తెలుసుకొని ఆ వివరాలను బూత్ లెవెల్ అధికారికి అందజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బూత్ లెవెల్ అధికారులు అత్యంత బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.
యోగా దినోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలి
జిల్లాలో అంతర్జాతీయ యోగా కార్యక్రమం నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 10,704 మంది ట్రైనర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన వారి రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మొత్తం 3 లక్షల 91 వేలమంది పాల్గొనేలా రిజిస్ట్రేషన్ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు లక్షా 79 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో జేసీ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు పాల్గొన్నారు.


