ఆ ఇంటికి దిక్కెవరు? | - | Sakshi
Sakshi News home page

ఆ ఇంటికి దిక్కెవరు?

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

ఆ ఇంటికి దిక్కెవరు? పిడుగు పడి మూడు మేకల మృతి రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రాజాం సిటీ: భార్య అనారోగ్యంతో ఉన్నా ఆ కుటుంబపెద్ద ఏనాడూ అధైర్యపడలేదు. దివ్యాంగురాలైన ముప్పైఏళ్ల కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కుటుంబాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నాడు. తీర్థయాత్రలకు వెళ్లే వారికి వంటలు చేసేందుకు టూరిస్టు బస్సుతో వెళ్లేవాడు. ఖాళీ సమయాల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆ కుటుంబంపై విధి కన్నెర్ర జేసి విధి వంచితురాలైన కుమార్తెకు తండ్రిని, మంచంపట్టిన భార్యకు భర్తను దూరం చేసింది. ఈ విషాదకర ఘటన రాజాం మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ విషాద ఘటనపై గ్రామస్తులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉంగటి లక్ష్మునాయుడు (55), అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు ఈ నెల 3న కాశీ యాత్రకు టూరిస్టు బస్సుతో వెళ్లారు. అక్కడ యాత్రికులతో సరదాగా గడిపి అన్ని తీర్థయాత్రలు ముగించుకుని బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌ జిల్లా అఃతపుర పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఆదివారం వేకువజామున 4గంటల సమయంలో తీర్థయాత్ర బస్సు రోడ్డు ప్రమాదానికి గురికాగా ఈ ప్రమాదంలో లక్ష్ము నాయుడు మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. రాజాం పరిసర ప్రాంతాలైన నందబలగ, బొద్దాం, ఇప్పిలిపేట గ్రామాలకు చెందిన మరో ఇరవై మంది వరకు అదే బస్సులో యాత్రకు వెళ్లారు. వారంతా క్షేమంగా ఉన్నట్లు కొత్తవలస నుంచి వెళ్లిన యాత్రికులు తెలిపారు.

గ్రామంలో విషాదం..

అందరితో కలివిడిగా ఉండే లక్ష్మునాయుడు తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. దివ్యాంగురాలైన కుమార్తె ఆదిలక్ష్మితో పాటు అనారోగ్యంతో బాదపడుతున్న భార్య అసిరప్పకు ఇకపై దిక్కెవరంటూ గ్రామస్తులంతా నిట్టూరుస్తూ శోకసంద్రంలో మునిగిపోయారు.

చీపురుపల్లి రూరల్‌

(గరివిడి): గరివిడి మండలంలోని ఎం.దుగ్గివలస గ్రామంలో ముచ్చర్ల గొల్లోడుకు చెందిన మూడు మేకలు పిడుగు పడి ఆదివారం మృతి చెందాయి. గ్రామానికి చెందిన పొదిలాపు సింహాచలం ఆమె భర్త సాంబయ్యతో పాటు ముచ్చర్ల గొల్లోడు ఆవులు, మేకలను తీసుకుని పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కురిసిన వర్షం, గాలులకు వారు ఉండే ప్రాంతంలో పిడుగులు పడడంతో గొల్లోడుకు చెందిన మూడు మేకలు మృతి చెందాయి. అదే విధంగా పక్కనే ఉన్న మహిళ సింహాచలం స్పృహ కోల్పోయింది. ఇంటికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేయగా స్పృహ నుంచి ఆమె కోలుకుంది.

అనకాపల్లి టౌన్‌: స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో శంకరం గ్రామం వద్ద రైలు నుంచి జారి పడి ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీఎఫ్‌ ఎస్సై కేటీఆర్‌ లక్ష్మి తెలిపారు. విశాఖపట్నం– విజయవాడ ట్రాక్‌ మధ్యలో మృతదేహాన్ని గుర్తించామని, మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. బ్లాక్‌ కలర్‌ ట్రాక్‌ ఫ్యాంట్‌, మెరూన్‌ రంగు టీషర్ట్‌ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వద్ద టచ్‌ ఫోన్‌, ఆధార్‌ కార్డు, చిరిగిన జనరల్‌ రైల్వే టికెట్‌ లభించాయని, వాటి ప్రకారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలోని కీర్తివీధికి చెందిన ఇట్లా భాస్కరరావుగా మృతుడిని గుర్తించామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించి, బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్సై చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో కుటుంబపెద్ద మృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement