విజయనగరం గంటస్తంభం: రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో విజయనగరం జిల్లాకు జరిగిన అభివృద్ధిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎల్బీజీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాకు కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి నిధులు ఎంత మేరకు వచ్చాయో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోందని, మండల స్థాయి ఆస్పత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా కొత్త పరిశ్రమలు తీసురావాలని సూచించారు. అభివృద్ధి పేరుతో భూముల సేకరణకు బదులుగా స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరే చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే ప్రజల తరఫున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు.


