మక్కువ:
గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపాల నివారణ, రైతుల ఆదాయాభివృద్ధి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో బయోఫోర్టిఫైడ్ వరి రకాల సాగు కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ అన్నారు. వర్సిటీ, భారతీయ వరి పరిశోధన సంస్థ (హైదరాబాద్) సంయుక్తంగా గిరిజన ఉప ప్రణాళిక కింద నిర్వహిస్తున్న అవగాహన, విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా అనసభద్ర, మరిపివలస గ్రామాల్లో గిరిజన రైతులకు శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వీసీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో వ్యవసాయం, ఆరోగ్యం, పోషకాహారం పరస్పర అనుసంధానిత అంశాలని పేర్కొన్నారు. బోటనీ విభాగాధిపతి డాక్టర్ అనిరుధ్ కుమార్ మాట్లాడుతూ బయోఫోర్టిఫైడ్ వరి రకాలు, సాధారణ వరి రకాల కంటే అధిక పోషక విలువలను కలిగి ఉండడంతో పాటు ఐరన్, జింక్ వంటి సూక్ష్మపోషకాల లోపాలను తగ్గించడంలో ఉపయోగపడతాయని వివరించారు. రైతులకు విత్తనాల ఎంపిక, సాగు నిర్వహణ, దిగుబడి మెరుగుదల, మార్కెట్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. భారతీయ వరి పరిశోధన సంస్థ ప్రిన్సిపాల్, సైంటిస్ట్ డాక్టర్ సి.ఎన్.నీరజ, శాస్త్రవేత్తల బృందం విశ్వవిద్యాలయంతో కొనసాగుతున్న సహకార కార్యక్రమంలో భాగంగా సాంకేతిక మార్గదర్శకత్వం అందించారు. బయోఫోర్టిఫైడ్ వరి రకాల ఎంపిక, గిరిజన ప్రాంతాలకు అనువైన సాగు విధానాలు, రైతులకు శిక్షణ కార్యక్రమాల రూపకల్పన తీరును వివరించారు. గతంలో మక్కువ మండలంలోని జగ్గుదొరవలస గ్రామంలో 2026 ఫిబ్రవరి మార్చి నెలల్లో ఇలాంటి అవగాహన, పరిశోధన, రైతు–శాస్త్రవేత్తల పరస్పర చర్చా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు ఇన్‌చార్జి వీసీ శ్రీనివాసన్ తెలిపారు. కార్యక్రమంలో భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, సీటీయూఏపీ అధ్యాపకులు ఎం.గంగునాయుడు, రైతులు పాల్గొన్నారు.


