కార్యకర్త కుటుంబానికి జెడ్పీ చైర్మన్‌ ఆసరా | - | Sakshi
Sakshi News home page

కార్యకర్త కుటుంబానికి జెడ్పీ చైర్మన్‌ ఆసరా

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

ఇంటర్‌ విద్యకోసం రూ.లక్షా,

10 వేలు ఆర్థిక సాయం

విజయనగరం: కార్యకర్తలే ఏ పార్టీకై నా పునాదులు. పునాది లాంటి కార్యకర్తల హదయాలు గెలుచుకున్న వారే నేతలుగా, నాయకులుగా నాలుగు కాలాలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. పార్టీలో ఉండే ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిగా భావించిన నాయకుడు మాత్రమే వారిని, వారి కుటుంబాలను కష్టకాలంలో ఆదుకుంటాడు. అలాంటి అరుదైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా, తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునే నాయకుడు విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ భీమిలి నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా మరోసారి తమ పార్టీ కార్యకర్త కుటుంబం పట్ల తనకున్న వాత్సల్యాన్ని, ఉదారతను ఆయన చాటుకున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం, పద్మనాభం గ్రామానికి చెందిన వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కంటుభుక్త శ్రీను కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి నియోజకవర్గ నాయకుల ద్వారా తెలుసుకున్న జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మానవతా ధృక్పథంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. మృతి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుమార్తె కంటుభుక్త మాధురిని ఇంటర్‌మీడియట్‌ విద్యలో చేర్పించడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించారు. బోయపాలెం శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో ఆమెను ఇంటర్‌ విద్య కోసం చేర్పించి విద్యాభ్యాసానికి అవసరమైన రూ. లక్షా, 10 వేలు ఫీజును చెల్లించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థిని మాధురి, ఆమె తల్లితో కలిసి వచ్చి క్యాంప్‌ కార్యాలయంలో చిన్న శ్రీను, సిరిసహ్రలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, మాధురి ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్నశ్రీను ఆకాంక్షించారు. కార్యక్రమంలో పద్మనాభం ఎంపీపీ కంటుభుక్త రాంబాబు, పద్మనాభం సర్పంచ్‌ తాలాడ పద్మనాభం ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement