కేజీహెచ్‌లో మృతి వాస్తవమే..
రామభద్రపురం మండలానికి చెందిన గాయిత్రి అనే బాలిక కేజీహెచ్‌లో మృతి చెందింది. ఆమె మృతికి సంబంధించి పూరి స్థాయి రిపోర్టులు తెప్పించుకుని పరిశీలించిన మీదట ఏ వ్యాధితో మరణించిందో చెబుతాం. జ్వరాల వ్యాప్తితో అప్రమత్తంగా ఉన్నాం. జ్వరపీడితులకు సకాలంలో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచే జ్వరాల వ్యాప్తి ప్రారంభం అయింది. దీంతో ఐదు నెలల వ్యవధిలో లక్షలాది మంది జ్వరాల బారిన పడ్డారు. వైరల్ జ్వరంతో కొందరు, మలేరియాతో కొందరు, డెంగీ, టైఫాయిడ్ బారిన మరికొందరు పడుతున్నారు. జ్వరాల బారిన పడినవారు కొంతమంది పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకొంతమంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు.
రెండు లక్షలకు పైగా జ్వరాల కేసులు నమోదు
ఈ ఏడాది జనవరి నెల నుంచి మే నెలఖారు నాటికి జిల్లాలో లక్షలాది మంది జ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన జ్వరాల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ నమోదు చేస్తుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదు అయిన జ్వరాల వివరాలు వైద్య ఆరోగ్య శాఖ నమోదు చేయదు. ఈ ఏడాది ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 1,66,248 జ్వరాల కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 70 వేల నుంచి 80 వేల వరకు జ్వరాల కేసులు నమోదయ్యాయి. ఇందులో 110 మలేరియా కేసులు, 25 డెంగీ కేసులు ఉన్నాయి. గతంలో మలేరియా కేసులు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అయ్యేవి. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి.
చికిత్స అందించడంలో నిర్లక్ష్యం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో జ్వర పీడితులకు వ్యాధి నిర్ధారణలోనూ, చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు సకాలంలో ఇవ్వక పోవడం, చికిత్స అందించడంలో జాప్యం వల్ల రోగులు కొంత మంది మృత్యువాత పడుతుండగా, మరి కొంతమంది ప్రాణాల మీదకు వస్తుంది. జ్వర పీడితులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తగ్గిపోతున్న ప్లేట్‌లెట్స్
గతంలో డెంగీ, మలేరియా బారిన పడిన వారికి ప్లేట్‌లెట్స్ తగ్గిపోయేవి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్‌లో కూడా ప్లేట్‌లెట్స్ తగ్గిపోతున్నాయి. ప్లేట్‌లెట్స్ దొరక్క రోగుల బంధువులు బ్లడ్ బ్యాంక్‌లకు పరుగులు పెడుతున్నారు. అయినా కష్టాలు తప్పడం లేదు.
మలేరియాతో రామభద్రపురం
మండలానికి చెందిన ఓ బాలిక మృతి!
వివరాలు గోప్యంగా ఉంచిన వైద్య శాఖ అధికారులు
ఐదు నెలల్లో జ్వరాల బారిన పడినవారు రెండు లక్షల మంది
120 మలేరియా కేసులు నమోదు
25 డెంగీ కేసులు నమోదు
జ్వరపీడితులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు
తగ్గిపోతున్న ప్లేట్‌లెట్స్


