విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) సభ్యులు డాక్టర్ జయచంద్రనాయుడు, అనురాధ బేగం, ఇమంది సుధీర్ మంగళవారం ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. ఓపీ విభాగాలను, క్యాజువాలటీ, ఐసీయూ, హోమియో, యునాని, నేచురోపతి విభాగాలను పరిశీలించారు. వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆస్పత్రి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకిచ్చిన హామీలు అమలు చేయాలి
● ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు
విజయనగరం గంటస్తంభం: విద్యార్థులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో జూలై 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయం అమర్ భవన్‌లో శిక్షణా తరగతుల కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు ఇబ్బందిగా మారిన జీవో నెం.77ను రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం విద్యను బలోపేతం చేయకుండా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రోత్సహిస్తోందన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి విద్యా దోపిడిని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం, ఉపాధ్యక్షుడు సుమన్, సహాయ కార్యదర్మి గౌరీశంకర్, పట్టణ నాయకులు చరణ్, గణేష్ పాల్గొన్నారు.


