విజయనగరం రూరల్: కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయంలో గిరిజన అధ్యయనాల విభాగం ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 126వ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌చార్జ్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా గిరిజనుల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన నడిపిన ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు. గిరిజనుల సామాజిక, సాంస్కతిక, ఆర్థిక అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా ప్రారంభోపన్యాసం చేస్తూ, భగవాన్ బిర్సా ముండా భారతదేశ గిరిజన సమాజ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయుడని పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, భూమి, సంస్కతి, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో గిరిజన అధ్యయనాల విభాగం ఇన్‌చార్జ్ విభాగాధిపతి డాక్టర్ దివ్య.కె, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, అతిథి అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


