● మూడు రోజుల పాటు ఉత్సవాలు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు చదురుగుడి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి 25 వరకూ మూడు రోజుల పాటూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని దేవదాయ శాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీషా తెలిపారు. స్థానిక చదురుగుడి ప్రాంగణంలో విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు ఆధ్వర్యంలో ఉత్సవాల కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది నవంబర్ 10వ తేదీన సోమవారం అమ్మవారి చదురుగుడి విస్తరణ పనుల్లో భాగంగా కళాప్రకర్షణ చేపట్టి, పక్కనే బాలాలయం నిర్మించామని, అప్పటి నుంచి నేటి వరకు బాలాలయంలోనే అమ్మవారి దర్శనం కల్పించామన్నారు.
కేవలం ఆరు నెలల వ్యవధిలోనే చదురుగుడి విస్తరణ పనులు శరవేగంగా చేపట్టగలిగామన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ రూ.కోటీ 80లక్షల వ్యయంతో ఆలయ అభివృద్ధిపనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


