విక్రమ్‌పూల జిల్లా పర్యటన రేపు
విజయనగరం: రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ విక్రమ్‌పూల విజయనగరం జిల్లాలో ఈ నెల 21న పర్యటించనున్నారని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ తెలిపారు. 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గీతాంజలి పాఠశాలలో నిర్వహిస్తున్న ఉత్సవంలో విక్రమ్‌పూల పాల్గొంటారన్నారు. అధికార భాషా సంఘం చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత విక్రమ్ విజయనగరంలో తొలిసారిగా పర్యటిస్తున్నారన్నారు.
నేడు బీఎడ్ కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహిళా ఇన్‌సర్వీస్ టీచర్లకు 2026–27 విద్యా సంవత్సరానికి బీఎడ్ దూర విద్య ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనుంది. విజయనగరం పట్టణ శివారున ఉన్న కరకవలసలోని డాక్టర్ పీవీజీ రాజాసాహెబ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆ సెంటర్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.శ్రీనివాసమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ–మెయిల్ ద్వారా సమాచారం అందుకున్న ఇన్‌సర్వీస్ టీచర్లు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని అభ్యర్థులు స్టడీ సెంటర్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం 0877–2284525, 0877–2284603, 81217 87415 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
భార్య మందలించిందని..
భర్త ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన భర్త తనువు చాలించిన ఘటన విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ అశోక్ చెప్పిన వివరాలు.. విజయనగరం వీటీ అగ్రహారం పరిధిలోని గాంధీనగర్‌లో బెవర శ్రీనివాస్, రేవతి దంపతులు తమ ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నారు. రోజు మద్యం సేవించి ఇంటికి వస్తున్న బెవర శ్రీనివాస్‌ను భార్య రేవతి మందలిస్తూనే ఉంది. చికెన్ షాపులో పని చేస్తు న్న శ్రీనివాస్ అరకొర సంపాదనతోనే భార్య రేవతి కుటుంబాన్ని నెట్టుకోస్తోంది. ఒకానొక సమయంలో మద్యం తాగాడని ఇరువురి మధ్య జరిగిన కొట్లాట చివరకు మహిళా పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు మందలించి పంపించినప్పటికి శ్రీనివాస్‌లో మార్పు రాలేదు. ఇంట్లో ఉంటున్న శ్రీనివాస్ మద్యానికి బానిసై భార్య తో ఎప్పటిలాగే గురువారం గొడవ పడ్డాడు. అందుకు భార్య రేవతి మందలించింది. వెనువెంటనే గదిలోకి వెళ్లి తలుపు వేసుకునిఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
విక్రమ్‌పూల జిల్లా పర్యటన రేపు


