ఇదెక్కడి విడ్డూరం..
చీపురుపల్లి: సాధారణంగా ఏదైనా ప్రారంభోత్సవం అంటే అధికారిక శిలా ఫలకం, ప్రజాప్రతినిధుల ఆహ్వానం, సభ వంటి హడావుడి ఉంటుంది. కానీ శనివారం చీపురుపల్లి నుంచి రాజాం రోడ్‌లో నూతనంగా నిర్మితమైన రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) ప్రారంభోత్సవ కార్యక్రమం విడ్డూరంగా అనిపించిందనే చర్చ జరిగింది. అసలు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చేస్తున్నది ఆర్‌ఓబీ ప్రారంభోత్సవమా... ఆర్‌టీసీ బస్సు ప్రారంభోత్సవమో.. తెలియక సాక్షాత్తూ సొంత టీడీపీ కార్యకర్తలే చెవులు కొరుక్కోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చీపురుపల్లిలో ఆర్‌ఓబీ ప్రారంభోత్సవం ఉందంటూ నాలుగైదు రోజులు క్రితమే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రచారం చేశారు. శనివారం ప్రారంభోత్సవం అని చెప్పినప్పటికీ శుక్రవారం రాత్రి వరకు బ్రిడ్జిపై ఎలాంటి ప్రారంభోత్సవ హడావుడి కనిపించలేదు. శనివారం ఉదయం కనీసం శిలాఫలకం కూడా ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఎమ్మెల్యే, ఎంపీలు తమ కార్యకర్తలతో కలిసి వచ్చి రిబ్బన్ కట్ చేసి వాహనాలు పంపించారు.
బ్రిడ్జి ప్రారంభోత్సవమా.....బస్సు ప్రారంభోత్సవమా..!
ఇదిలా ఉండగా చీపురుపల్లి ఆర్‌ఓబీపై రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే కళా వెంకటరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన చీపురుపల్లి నుంచి రాజాం వెళ్లే బస్సును కార్యకర్తలతో కలిసి ఎక్కి రాజాం వైపు వెళ్లారు. తిరిగి ఇరవై నిమిషాల వరకు రాకపోవడంతో బ్రిడ్జి ప్రారంభోత్సవమా లేక బస్సు ప్రారంభోత్సవమో అర్థం కావడం లేదని టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకున్నారు. తిరిగి బస్సులో చీపురుపల్లి వైపు వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీలు బ్రిడ్జిపై బస్సు ఆపకుండా ఎమ్మెల్యే కార్యాలయం వరకు అదే బస్సులో వెళ్లిపోయారు. దీంతో ఆర్‌ఓబీ వద్ద ఎదురు చూసిన కార్యకర్తలకు నిరాశ తప్పలేదు.
ప్రజాప్రతినిధులకు అందని ఆహ్వానం
ఆర్‌ఓబీ ప్రారంభోత్సవం అంటూ అధికార పార్టీ ముందు నుంచే ప్రచారం చేసింది. అయితే చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఇలా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎవ్వరికీ కనీసం ఆహ్వానం అందలేదు. శిలా ఫలకం ఎలాగూ లేదు సరికదా కనీసం ఆహ్వానం కూడా లేకపోవడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.
అధికారిక శిలా ఫలకం లేకుండానే..
ప్రజాప్రతినిధులకు ఆహ్వానం కూడా లేదు..
బ్రిడ్జి ప్రారంభోత్సవమా..
బస్సు ప్రారంభోత్సవమా..!


