గంజాయి నిందితుల అరెస్టు
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి పోలీసు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం పట్టుబడిన ఎనిమిది గంజాయి నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి ఎస్‌ఐ ప్రసాదరావుతో కలిసి సీఐ కె.నారాయణరావు శనివారం వివరాలు వెల్లడించారు. పార్వతీపురం పట్టణం చాకలివీధికి చెందిన చీపురపల్లి కనకరాజు అలియాస్ ప్రేమ్‌కుమార్, చీపురుపల్లికి చెందిన సాకేటి రామ్‌సోనీకుమార్, పాలవలస శివకుమార్, బత్తిన నితీష్‌కుమార్, రాజాంకు చెందిన సురాపాటి సాయికుమార్, వంగర గ్రామానికి చెందిన గాడి ప్రదీప్, సాలూరుకు చెందిన మేడిసెట్టి మణి, పెదపోలు అజయ్ పోలీసులకు పట్టుబడని మరో ఏడుగురు కలిసి ఒడిశా రాష్ట్రం సుంకికి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులతో డీల్ కుదుర్చుకుని మూడేళుల్గా గంజాయి వ్యాపారం చేస్తూ వారు కూడా సేవిస్తున్నారు. శుక్రవారం ఒకొక్కరు కేజీ నుంచి కేజీన్నర వరకు గంజాయి పట్టుకుని ఎనిమిది మంది కలిసి సుమారు 15.765 కిలోల గంజాయి ప్యాకెట్లతో మూడు బైక్‌లపై సాలూరు మీదుగా వస్తున్నారు. కొట్టక్కి పోలీస్ చెక్‌పోస్టు వద్దకు వచ్చేసరికి పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయి ప్యాకెట్లతో పట్టుబడ్డారు. వీరి నుంచి గంజాయి ప్యాకెట్లు, మూడు బైక్‌లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా సుంకిలో కిలో గంజాయి రూ.వెయ్యికి కొనుగోలు చేసి ఉమ్మడి జిల్లాల్లోని పలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, దుకాణాలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు తేలింది. ఎనిమిది మంది నిందితులపై సీఐ కేసు నమోదు చేశారు. మిగిలిన ఏడుగురు కోసం గాలింపు చేపట్టినట్టు తెలిపారు.


