అనుమానాస్పద స్థితిలో గిరిజనుడి మృతి
● గిరిజన సంఘాల ఆందోళన
● మృతిపై విచారణ, కుటుంబానికి సాయంపై డిమాండ్
పార్వతీపురం రూరల్: మద్యం మహమ్మారి నుంచి విముక్తి కల్పిస్తామని నమ్మబలికిన ఓ స్వచ్ఛంద సంస్థ ఓ గిరిజన కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆరోగ్యం అందిస్తామని తీసుకెళ్లిన వారు.. మూడు రోజులకే విగతజీవిగా అప్పగించడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పార్వతీపురం మండలం మరికి పంచాయతీ కొత్తఊరు గ్రామంలో జరిగిన విషాద ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన మండంగి భాస్కర రావు అనే గిరిజన యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు, గ్రామస్తులు ఆదివారం మృతదేహంతో ఆందోళనకు దిగారు.
మృతిపై వెల్లువెత్తిన అనుమానాలు..
గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి.సంగం వెల్లడించిన వివరాల ప్రకారం..కొత్తూరు గ్రామానికి చెందిన మండంగి భాస్కరరావు (35) మద్యానికి బానిసయ్యాడు. వ్యసనం నుంచి దూరం చేస్తామని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి పంపుతామని నమ్మబలికిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పార్వతీపురంలోని వైకేఎం కాలనీలో వారు ఏర్పాటు చేసిన గృహానికి (కేంద్రానికి) భాస్కరరావును తీసుకెళ్లారు. మూడు రోజుల క్రితం కేంద్రంలో చేరిన భాస్కర రావు శనివారం ఉదయం హఠాత్తుగా మృతి చెందాడన్న వార్త కుటుంబసభ్యులను కుదిపేసింది.
ఆదుకోవాలని ఆవేదన..
ఈ సందర్భంగా నాయకులు రంజిత్ కుమార్, సంగం మాట్లాడుతూ భాస్కర రావు మృతిపై నెలకొన్న అనుమానాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి. మృతుడు నిరుపేద గిరిజన యువకుడు. భార్య, కుటుంబం ఉన్నాయి. వారి జీవనాధారం పోయింది. కాబట్టి ఆ పేద గిరిజన కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బలంగా డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌తో పాటు పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో గిరిజనుడి మృతి


