మాలధారణం.. నియమాల తోరణం
● 41 రోజుల అయ్యప్ప దీక్ష..
భక్తి విరాట రూపం
విజయనగరం గంటస్తంభం: కార్తీకమాసం ప్రారంభమైన క్షణం నుంచి అనేక ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దీక్షలను ప్రారంభించే మాలాధారులు లక్షల్లో ఉంటారు. 41 రోజుల మండల దీక్షతో భిన్నమైన ఆధ్యాత్మిక జీవనశైలి వారికి అలవడుతుంది. తెల్లవారు జామునే లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటితో స్నానం, కటికనేలపై నిద్ర, నల్లని బట్టలు, బ్రహ్మచర్యం, ఏకభుక్తం..ప్రతి ఒక్కరి వ్యక్తిత్వంలో మార్పులను తెస్తాయి.
కేరళలో అయ్యప్ప క్షేత్రం
కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలోని పశ్చిమ కనుమల్లో శబరిమలై క్షేత్రం నెలకొని ఉంది. స్వామిని ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మలయాళ వృశ్చికమానం (నవంబరు–డిసెంబరు)లో మండల చిరప్పు ప్రారంభమవుతుంది. ఇందుకోసం కార్తీకం ముందునుంచి దీక్ష తీసుకుంటారు. ఆ రోజు నుంచి భక్తుల జీవనశైలి మారిపోతుంది. నల్లని బట్టలు ధరించి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ, సాగించే దీక్షలోని నియమాలు సామన్యులకు కఠినమే. అలాగే దీక్షా సమయంలో అందరూ స్వామిగా భావించి వ్యవహరించడం అపురూప అనుభూతిని ఇస్తుంది. మండలకాలం (41 రోజులు) స్వామిదీక్షను పూర్తిచేసుకుని ఇరుముడిని కట్టుకుని శబరిమలై వెళ్లాలి. నేతితో నిండిన కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు, బియ్యం, వస్త్రాలు..తదితరాలతో నిండిన ఈ మూటను గురుస్వామి భక్తుల శిరస్సున ఉంచుతారు. మలయాళ కార్తీకం నుంచి మకరవిళక్కు వరకు అనేకమంది భక్తులు అయ్యప్ప స్వామికి నేతిని సమర్పించి అభిషేక దర్శనం పొందుతారు.
ఎలా చేరుకోవాలి?
రైలులో వెళ్తే చెంగనూరు లేదా కొట్టాయం రైల్వే స్టేషన్లలో దిగాలి. అక్కడి నుంచి బస్సు, కారు ద్వారా పంబ చేరుకోవచ్చు.విమాన ప్రయాణికులు తిరువనంతపురం లేదా కొచ్చి విమానాశ్రయాలకు చేరుకుని అక్కడి నుంచి వాహనాల ద్వారా పంపకు వచ్చేయచ్చు. పంప నుంచి కాలినడకనే యాత్ర. నడకలోనే యాత్ర అసలు భావం.
ఆధ్యాత్మిక జీవనానికి శిక్షణ కేంద్రం..
ఈ 41 రోజులు దీక్ష చేసిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇది కేవలం దీక్ష కాదు మన మససును శుద్ధి చేసే, మనసులోని అహంకారాన్ని తొలగించే ఆధ్యాత్మిక సాధన.
మాలధారణం.. నియమాల తోరణం
మాలధారణం.. నియమాల తోరణం


