వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల వివరాల నమోదు
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: ప్రజాసమ్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో సమర్పించే అర్జీల వివరాలను మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిలో 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు సెల్లార్‌లో ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. అర్జీదారులు మీకోసం డాట్ ఏపీడాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీ నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు 1100కు నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు.
అయ్యప్ప పాదాలను తాకిన
సూర్యకిరణాలు
పార్వతీపురం: పట్టణంలోని శ్రీవిద్యా సర్వమంగళ పీఠం ప్రాంగణంలో కొలువైన అయ్యప్ప స్వామి పాదాలను ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తి కిరణాలు ఆదివారం ప్రభాత కాల సమయంలో స్పృశించాయి. సూర్యనారాయణమూర్తికి అత్యంత ప్రీతికరమైన ఆదివారం శబరిమలై సన్నిధానంలో స్వామివారి దేవాలయంలో మండల పూజకు సిద్ధమవుతున్న సమయంలో పార్వతీపురం పట్టణంలోని శ్రీధర్మశాస్తా పాదాలను సూర్యకిరణాలు తాకడం అత్యంత శుభప్రదమని దేవాలయ ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ కాళిదాసు గురుస్వామి తెలిపారు.
మక్కువలో..
మక్కువ: స్థానిక భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో కొలువైన అయ్యప్ప ఆలయంలోని స్వామి విగ్రహాన్ని ఆదివారం ఆదిత్యుని కిరణాలు తాకాయి. ఉదయం 6:45 గంటల సమయంలో అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని సూర్యకిరణాలు తాకడంతో, అయ్యప్ప స్వామిని భక్తులు దర్శించుకుని నమస్కరించుకున్నారు.
బస్సు ప్రయాణికుడి కాలికి గాయం
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బొబ్బిలి వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న క్రమంలో జె. వెంకట్రావు అనే వ్యక్తి కాలు ప్రమాదవశాత్తు బస్సు ముందు టైరు కింద ఇరుకోవడంతో కాలికి గాయమైంది. దీంతో తక్షణమే స్థానికులు వెంకట్రావును హుటాహుటిన జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు ఆస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల వివరాల నమోదు


