ముగిసిన రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో గడిచిన రెండు రోజులగా జరుగుతున్న రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచి మొత్తం 300 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరై సత్తా చాటారు. వివిధ జిల్లాలకు చెందిన లిఫ్టర్లు ఆయా విభాగాల్లో బరువులెత్తి పతకాలు సాధించారు. విజయనగరం జిల్లాకు చెందిన 12 మంది పురుషులు, ఏడుగురు మహిళలు సీనియర్, జూనియర్ విభాగాల్లో ప్రథమ స్థానాల్లో నిలిచారు. కడప, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. ముగింపు కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగార్రాజు, టీడీపీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద్ కుమార్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


