‘స్వేచ్ఛ..నా సందేశం’ పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: డాక్టర్ జీవీఎస్ జైపాల్‌రావు రచించిన కవిత్వం ‘స్వేచ్ఛ నా సందేశం’ పుస్తకావిష్కరణ స్థానిక జెడ్పీ సమావేశమందిరంలో ఆదివారం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అరసం జిల్లా అధ్యక్షుడు జీఎస్.చలం సభాధ్యక్ష్యత వహించగా, కార్యదర్శి రత్నాల బాలకృష్ణ ఆహ్వానం పలికారు. సుప్రసిద్ధ కవి, విమర్శకుడు, విమల సాహితీ సంస్థ అధ్యక్షుడు జె.విద్యాధర్ పుస్తకావిష్కరణ చేశారు. స్వేచ్ఛ దేశానికి అవసరమని, అటువంటి స్వేచ్ఛా సందేశాన్ని తన ప్రతి కవితలోనూ రచయిత వినిపించారన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ కవి, విమర్శకుడు, సినీగేయ రచయిత బిక్కి కృష్ణ మాట్లాడుతూ దేశ, ప్రాంత, సామాజిక సమస్యలన్నింటిి మీద తనదైన శైలిలో కవి తన కవితలలో నిశితంగా విమర్శించారన్నారు. గంటేడ గౌరునాయుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కందుల సురేఖ ప్రసంగించారు. కవి, విమర్శకుడు సుంకర గోపాలయ్య పుస్తకాన్ని సమీక్ష చేశారు. చీకటి చంద్రిక గీతంతో సభ ప్రారంభమైంది. పాయల మురళీకృష్ణ పుస్తకానికి ఆప్తవాక్యాన్ని అందించారు. సామాజిక స్పృహ, చైతన్యంతో కూడిన ఈ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో సాహిత్య అభిమానులు, కవులు, రచయితలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


