కబడ్డీ జట్ల ఎంపికకు స్పందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలకు అనూహ్య స్పందన లభించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. క్రీడాకారులకు నగరంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎంపికలు నిర్వహించగా..2009 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించిన 60 కేజీల లోపు బరువు కలిగిన బాలుర క్రీడాకారులు, 55 కేజీల లోపు బరువు కలిగిన బాలికలు పాల్గొన్నారు. అద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరగబోయే అంతర్ జిల్లా సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ అధ్యక్షుడు రంగారావుదొర వెల్లడించారు. ఎంపిక పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు కె.గోపాల్, మీసాల శ్రీనివాసరావు, మజ్జి తిరుపతిరావు, బంటుపల్లి శివ, సారిపల్లి గౌరీ శంకర్, నడిపేన మురళీధరరావు తదితరులు పర్యవేక్షించారు.
200 మంది క్రీడాకారుల హాజరు


