సాధారణ రోగుల మధ్యలో డయేరియా రోగులు
బాడంగి: స్థానిక సీహెచ్‌సీలో సాధారణ రోగులకు కేటాయించిన ఇన్‌పేషెంట్ వార్డులోనే డయేరియా సోకిన రోగులకు కూడా సమానంగా ఒకేచోట బెడ్లు ఇచ్చి చికిత్స చేయడంపట్ల సాధారణ రోగులు ఆందోళన చెందుతున్నారు. డయేరియా అంటువ్యాధి గనుక సాధారణ రోగులకు సోకే ప్రమాదముందన్న ఆలోచనతో వారు భయపడుతున్నారు. కావున డయేరియా రోగులకు ప్రత్యేక వార్డు కేటాయించి చికిత్స చేస్తే బాగుంటుందని వైద్యులకు సూచిస్తున్నారు. రామభద్రపురం మండలానికి చెందిన పలువురు డయేరియా రోగులతో కలిసి ఒకే దగ్గర చికిత్స పొందడాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు. దుర్వాసనతో పాటు, దోమలు ఈగల బెడద ఉందని, వైద్యులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
24 గంటల్లో.. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి
శృంగవరపుకోట: ముద్దుగా పెంచుకున్న మనుమడు చనిపోయాడని తెలిసి తట్టుకోలేక గుండె ఆగిపోయి నాయనమ్మ తనువు చాలించింది. ఎస్.కోట మండలంలోని మూలబొడ్డవర పంచాయతీ పరిధి లచ్చన్నదొరపాలెం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొర్లె కన్నాలమ్మ(65)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు సంతానం కాగా వారిలో ఇద్దరు కొడుకులు, పెద్ద కుమార్తె గతంలోనే కాలం చేశారు. కాగా కన్నాలమ్మ తన మనుమడు నాగరాజు వద్ద ఉంటోంది. నాగరాజు తన భార్య లక్ష్మి, చెల్లెలు సుహాసిని, నాయనమ్మ కన్నాలమ్మలతో ఉంటున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు కొద్ది రోజులుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. శనివారం సాయంత్రం 108 వాహనంలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్తున్న సమయంలో నాగరాజు మృతిచెందాడు. దీంతో హృద్రోగ భాదితురాలైన నాయనమ్మ కన్నాలమ్మకు విషయం తెలియకుండా దాచిపెట్టారు. ఆదివారం కన్నాలమ్మకు ఇరుగుపొరుగు వారి ద్వారా విషయం తెలియగా కూర్చున్న చోటనే కుప్పకూలిపోయింది. దీంతో గ్రామస్తులు కన్నాలమ్మను పరిశీలించి చనిపోయినట్లు గుర్తించారు. 24గంటల్లో ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. కుటుంబ యజమాని నాగరాజు ఆకస్మిక మృతితో భార్య లక్ష్మి, పిల్లలు దీక్షిత, ఆదర్శ్, చెల్లెలు సుహాసిని, అనాథలుగా మిగిలారు.
బస్సుకింద పడి యువకుడి మృతి
కొత్తవలస: మండల కేంద్రంలో గల మూడు రోడ్ల జంక్షన్‌లో ఆదివారం జరిగిన ప్రమాదంలో అస్సాం రాష్ట్రానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక డోర్ నుంచి ఆ యువకుడు బస్సు ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి బస్సు వెనుక చక్రాల కింద పడడంతో తలపైనుంచి బస్సు వెళ్లిపోగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది ఇలా ఉండగా ఆ యువకుడు కావాలనే ఒక్కసారిగా నడుచుకుంటూ వస్తూ బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడని ఆర్టీసీ బస్సు సిబ్బంది తెలిపారు. మృతుడి జేబులో గల సెల్‌ఫోన్ ఆధారంగా అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఈ మేరకు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు.
బస్సు కింద పడి వృద్ధుడు..
గంట్యాడ: మండలంలోని కొత్త వెలగాడ గ్రామానికి చెందిన చౌడవాడ దాలినాయుడు (70) ఆదివారం బస్సుకింద పడి ప్రమాదంలో మృతిచెందాడు, ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలో ఉన్న తన కుమారుడి ఇంటికి వెళ్లేందుకు దాలినాయుడు ఆదివారం బయల్దేరాడు. వసాది గ్రామ శివారులో కొత్తవెలగాడ బస్టాప్ వద్ద విజయనగరం నుంచి ఎస్.కోట వెళ్తున్న బస్సును ఆయన కోడలు ఆపి ఎడమవైపు వెళ్లగా, కుడివైపు నుంచి బస్సు ఎక్కేందుకు వృద్ధుడు వస్తున్న విషయం గమనించక డ్రైవర్ బస్సును తీసేయడంతో బస్సు కుడివైపు ఉన్న టైర్ కింద వృద్ధుడు పడిపోయాడు. దీంతో తలనుజ్జునుజ్జవగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు.
సాధారణ రోగుల మధ్యలో డయేరియా రోగులు
సాధారణ రోగుల మధ్యలో డయేరియా రోగులు
సాధారణ రోగుల మధ్యలో డయేరియా రోగులు


