వైద్యవిద్య ఫర్ సేల్..!
● పీపీపీ పేరిట 10 కళాశాలలు ప్రైవేట్‌కు ధారాదత్తం
● సంపదసృష్టి అంటూ ప్రభుత్వ
కళాశాలల్ని అమ్మేసే కుట్ర
విజయనగరం గంటస్తంభం: ఒంటిపై తెల్లటి ఆప్రాన్..మెడలో స్టెతస్కోప్..డాక్టర్ అనే పిలుపు..ఈ గౌరవం తమ పిల్లలకు దక్కాలని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు కలలు గంటారు. ఇలాంటి ఎందరో తల్లిదండ్రులు, విద్యార్థుల తెల్లకోటు కలలకు చంద్రబాబు సర్కారు ఉరితాడు బిగించింది. తాను సీఎంగా ఉండగా ఎన్నడూ ప్రభుత్వరంగంలో వైద్యకళాశాలల ఏర్పాటుకు కృషిచేయని చంద్రబాబు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలపై పెద్ద కుట్రకు తెరతీశారు. పీపీపీ పేరిట ఈ కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు పప్పుబెల్లాల్లా కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం బడుగు, బలహీనవర్గాల ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా చేయడంతో పాటు, విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను చిదిమేస్తున్నారని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పది ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీలో నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన క్రమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీపీపీ మోడల్‌లో నడిచే కళాశాలలు, ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందకపోవచ్చని వైద్యవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉచితంగా లభించే శస్త్రచికిత్సలు, మందులు, వైద్యసేవలు ఇకపై చెల్లింపుల ఆధారంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెనుకబడిన వర్గాలపై ప్రభావం
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ నిర్ణయం తీవ్ర అన్యాయం చేస్తుంది. పేదపిల్లలకు తక్కువ ఖర్చుతో వైద్యవిద్య లభించే అవకాశాలు తగ్గిపోవండంతో పాటు ఉచిత వైద్యసేవలు అందకుండా పేదలు నష్టపోతారు.


