ఆలయంలో ఆభరణాల చోరీ
● 5 తులాలు బంగారు, 2 కేజీల వెండి మాయం
సీతానగరం: మండలంలోని లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలో ఏకాదశిపూజలు ముగించుకుని అర్చకులు శ్రీనివాసాచార్యులు , వెంకటరమణాచార్యులు ఆలయం తలుపులు వేసుకుని శనివారం రాత్రి ఇళ్లకు వెళ్లారు. ఆదివారం వేకువజామున ఆలయం తలుపులు తీయడానికి వెళ్లగా దేవతామూర్తులుండే గదుల తలుపు తాళాలు విరగ్గొట్టి ఉండడాన్ని గుర్తించి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. సెక్యూరిటీ సిబ్బంది ఎం.మోహనరావు సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇన్‌చార్జి ఎస్సై సింహాచలం, ఏఎస్సై లక్ష్మణరావు సిబ్బందితో వచ్చి చోరీజరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఆలయంలో రాజ్యలక్ష్మమ్మకు అలంకరించిన పుస్తెలు, గోదా దేవి అమ్మవారి పుస్తెలు, రామచంద్రస్వామి వారికి, వెంకటేశ్వరస్వామి వారికి అలంకరించిన 5 తులాలు బంగారు, 2 కేజీల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు అర్చకులు వారికి వివరించారు. సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై లక్ష్మణరావు తెలియజేశారు.
సంఘటనా స్థలంపరిశీలన
వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పాలకొండ డీఎస్పీ రాంబాబు, పార్వతీపురం రూరల్ సీఐ రంగనాఽథ్, ఇన్‌చార్జి ఎస్సై సింహాచలం, సీసీఎస్ ఎస్సై అప్పారావు, ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్ ఎస్.శారద పరిశీలించారు.
ఆలయంలో ఆభరణాల చోరీ


