ఆనందం వెంబడి అంధకారం | - | Sakshi
Sakshi News home page

ఆనందం వెంబడి అంధకారం

Oct 17 2025 5:44 AM | Updated on Oct 17 2025 6:44 AM

ఆనందం వెంబడి అంధకారం

● బాణసంచా పేల్చడంలో జాగ్రత్తలు పాటించాలి

పెద్దలు వెంట ఉంటే ఆనందం మీ వెంటే

రామభద్రపురం: జాతి, కుల, మత,వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ దివ్య దీపావళి. చీకటిని పారదోలి వెలుగులు నింపే పండగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకోవడం ఆనవాయతీ. అయితే దీపావళిని వేడుకగా జరుపుకునే క్రమంలో చాలా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. టపాసులు పేల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బాణసంచాలోని రసాయనాలతో కళ్లు దెబ్బతింటాయి. సల్ఫర్‌, గన్‌పౌడర్‌ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీరు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి. ఒక్కోసారి కళ్లు పూర్తిగా కనబడకుండా పోతాయి.

నిఘాతోనే అక్రమానికి అడ్డు కట్ట

రూ.లక్షల విలువైన సరుకును ఎలాంటి అనుమతులు లేకుండా దిగుమతి చేసుకుని నిల్వ ఉంచుతున్నారు.పండగ రోజు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కొదరైతే ఏకంగా నివాస ప్రాంతాల మధ్య నిబంధనలు పాటించకుండా నిల్వ చేస్తున్నారు. అలాగే తాత్కాలికంగా అనుమతులు తీసుకున్న దుకాణాల వ్యాపారులు మిగిలిన సరుకును కొన్న చోటకే తిరిగి పంపాల్సి ఉంటుంది. కానీ కొందరు అలా చేయడం లేదు.పలు చోట్ల గుట్టుగా నిల్వ చేసి ఇతర సమయాల్లోనూ అమ్మేస్తున్నారు.కొందరైతే ఎలాంటి అనుమతులు లేకపోయినా పొరుగు ప్రాంతాల నుంచి పేలుడు పదార్థాలు తెప్పించి ఇళ్లలోనే టపాసులు తయారు చేస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి తనిఖీలు చేయకపోతే అనుమతి లేని వారు విక్రయాలతో పాటు చేసే నిల్వలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

సొంత వైద్యం వద్దు

టపాసులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కొందరు సొంత వైద్యం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రథమ చికిత్స చేసే ముందు కాలిన గాయంపై చల్లని నీరు పోయాలి. అంతేగానీ ఐస్‌ముక్కలతో రుద్దకూడదు. వెన్న గ్రీజ్‌, ఇతర పౌడర్లు వంటివి రాయకూడదు. వాటివల్ల ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది. దిలీప్‌కుమార్‌, వైద్యాధికారి,

పీహెచ్‌సీ, రామభద్రపురం

కాల్చే ముందు అప్రమత్తం

పెద్దవాళ్ల పర్యవేక్షణలోనే చిన్నారులు బాణసంచా కాల్చడం ఉత్తమం. టపాసులు కాల్చేటప్పుడు నీళ్లు దగ్గర పెట్టుకోవాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఉదయం 6 నుంచి 8 వరకు,రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలి.దీపావళి పండుగ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే ఏ విధమైన అనుమతులు లేకుండా బాణ సంచా విక్రయిస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.

వి.ప్రసాదరావు, ఎస్సై, రామభద్రపురం

ప్రమాద నివారణ, జాగ్రత్తలు ఇలా..

టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా జరగాలి

పేలని టపాసులపై వంగి చూడడం మంచిది కాదు

కంటికి రక్షణగా ప్లెయిన్‌ అద్దాలు వాడడం మంచిది

పేరున్న సంస్థలు తయారు చేసిన టపాసులనే ఎంపిక చేసుకోవాలి

పిల్లలు, యువకులు, మహిళలు ఇలా ఎవరు ఏ రకం టపాసులు కాల్చాలో ముందే నిర్ణయించుకుని ప్రణాళిక మేరకే కొనాలి

ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలి

బాణసంచాను కిచెన్‌, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచకూడదు

బాణసంచా కాల్చేటప్పుడు వదులుగా ఉన్న దుస్తులు ధరిస్తే అవి వేలాడుతూ అంటుకునే ప్రమాదం ఉంది. కొద్దిగా బిగుతైన కాటన్‌ దుస్తులను మాత్రమే ధరించాలి

చిన్న పిల్లలను ఎత్తుకుని బాణసంచా కాల్చకూడదు.పెద్ద వారి సహాయం లేకుండా పిల్లలు వారంతట వారే బాణసంచా కాల్చరాదు

అప్పుడే పుట్టిన చిన్నారులు, గర్భిణులు, వృద్ధులపై బాణసంచా శబ్దాలు ఎక్కువ ప్రమాదం చూపుతాయి. ప్రధానంగా చెవులు దెబ్బతింటాయి. చెవులను రక్షించుకోవడానికి ఇయర్‌ ప్లగ్స్‌ కొంత మేరకు ఉపయోగపడతాయి. పెద్ద శబ్దాలతో పేలే టపాసులు కాకుండా చాలా తక్కువ శబ్ధంతో పూలలాంటి వెలుగులు కురిపించే చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, పెన్సిళ్లు, భూచక్రాలు వంటివి కాల్చడం మంచిది.భూ చక్రాలు, ఔట్లు కూడా ఒక్కోసారి పేలే ప్రమాదం ఉంది. వాటిని అగ్గిపుల్లలతో కాకుండా కాకర పువ్తొత్తులతో కాల్చడం మంచిది.

ఆనందం వెంబడి అంధకారం1
1/2

ఆనందం వెంబడి అంధకారం

ఆనందం వెంబడి అంధకారం2
2/2

ఆనందం వెంబడి అంధకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement