
గిరిజన శాఖ మంత్రి బాధ్యత వహించాలి
సాలూరు: మంచి చదువులు చదివి జీవితంలో గొప్పస్థాయికి ఎదిగి తమ కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తారని కోటి ఆశలతో బిడ్డలను పాఠశాలలకు పంపగా అక్కడ సరైన సదుపాయాలు లేక అనారోగ్యాలకు గురై అమాయక గిరిజన బిడ్డలు మరణస్తున్నారు. ఆ బిడ్డల తల్లిదండ్రులకు సంబంధిత శాఖ మంత్రి, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనారోగ్యానికి గురై మరణించిన విద్యార్థులు, దివంగత మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ పువ్వలనాగేశ్వరరావులకు నివాళులు అర్పించి కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల ప్రాణాలు రక్షించడంలో గిరిజనసంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని, ఫలితంగా గిరిజన విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని గిరిజన విద్యార్థులు మరణిస్తుంటే గిరిజనశాఖ మంత్రికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మంది విద్యార్థులు మృతిచెందారని, సాలూరు నియోజకవర్గంలో ఇద్దరు మృతిచెందారన్నారు. కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 175 మంది పచ్చకామెర్లతో బాధపడుతూ కురుపాం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా సంబంధిత గిరిజన సంక్షేమశాఖమంత్రికి, ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు.
జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేశాం
విద్యార్థులు పచ్చకామెర్లతో చరిపోతున్నా,సెరిబ్రల్ మలేరియా, జ్వరంతో చనిపోతున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల మరణాలపై జాతీయమానవహక్కుల సంఘానికి, జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఢిల్లీలో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఇంతమంది విద్యార్థులు మృతిచెందడం వల్ల జిల్లా మంత్రిగా ఆమె విఫలమయ్యారని, ఈ శాఖలో మరణాలపై సదరు మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర