
వైద్యరంగంలో మత్తు వైద్యులది కీలక ప్రాత
● సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్
విజయనగరంఫోర్ట్: వైద్యరంగంలో మత్తు వైద్యులది కీలకపాత్ర అని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అన్నారు. ప్రపంచ మత్తు వైద్యుల దినోత్సవం సందర్భంగా సర్వజన ఆస్పత్రిలో నిర్వహించిన ర్యాలీని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర కేసులకు వైద్యం అందించడంలోనూ, శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన మత్తు ఇచ్చేది మత్తు వైద్యులేనన్నారు. కోవిడ్ తర్వాత మత్తు వైద్యులకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మత్తు వైద్య విభాగం అధిపతి డాక్టర్ డి.జయధీర్‌బాబు, ఆర్థో హెచ్‌ఓడీ డాక్టర్ లోక్‌నాథ్, మానసిక విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు.
సాలిపేటలో బంగారం చోరీ
గజపతినగరం: మండలంలోని సాలిపేట గ్రామానికి చెందిన రొంగలి శంకరరావు ఇంట్లో బంగారం చోరీకి గురి కావడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బుధవారం ఉదయం రొంగలి శంకరరావు తన ఇంటికి తాళం వేసి భార్య పద్మతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెవెళ్లాడన్నారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తెరిచి ఉన్నాయని, అలాగే బీరువా తలుపులు కూడా దొంగలు పగుల గొట్టారన్నారు. బీరువాలో ఉండాల్సిన సుమారు మూడు తులాలు బంగారం పుస్తెల తాడు, రెండు శతమానాలను దొంగిలించినట్లు బాధితుడు శంకరరావు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ మేరకు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.
మూగ బాలికపై వృద్ధుడి
లైంగిక దాడి యత్నం
శృంగవరపుకోట: మండలంలోని ధర్మవరం గ్రామంలో ఓ మూగ బాలికపై వృద్ధుడు లైంగికదాడి యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమారై మూగబాలిక. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఒంటరిగా ఉన్న బాలిక నోటిపై చెయ్యిపెట్టి తన ఇంట్లోకి వృద్ధుడు లాక్కెల్లాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వృద్ధుడి బారి నుంచి బాలికను రక్షించారు. బాధితురాలి తండ్రి గురువారం జామి మండలం తాండ్రంగి గ్రామానికి చెందిన మానవహక్కుల సంఘం ప్రతినిధి కొత్తలి గౌరునాయుడికి ఫిర్యాదు చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సీఐ నారాయణమూర్తిని వివరణ కోరగా ఫిర్యాదు అందిందని విచారణ చేయాల్సి ఉందన్నారు.

వైద్యరంగంలో మత్తు వైద్యులది కీలక ప్రాత