
రుణాల రికవరీపై దృష్టి పెట్టాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: రుణాల మంజూరుతోపాటు రికవరీపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్ర వారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాల రికవరీ సక్రమంగా ఉంటేనే మరిన్ని రుణాలు మంజూరుకు బ్యాంకులకు అవకాశముంటుందని చెప్పా రు. పీఎంఈజీపీ, పీఎంవిశ్వకర్మ, ముద్ర, స్టాండప్ ఇండియా, నాబార్డు రుణాల మంజూరు, రికవరీ పురోగతిని సమీక్షించారు. నాబార్డు అమలు చేస్తున్న ఆగ్రిక్లినిక్–అగ్రి బిజినెస్ సెంటర్ పథకం కింద వ్యవసాయ విద్యార్థులు ‘అగ్రిప్రెన్యూర్స్’గా మారి రైతులకు సాంకేతిక సేవలు, సలహాలు అందించవచ్చని తెలిపారు. నాబార్డు డీడీఎం నాగార్జున మాట్లాడుతూ ఈ పథకం కింద 45 రోజుల ఉచిత శిక్షణ, గరిష్టంగా రూ.20 లక్షల వరకు వ్యక్తిగత రుణం, రూ. కోటి వరకు గ్రూపు రుణం, మహిళలు, ఎస్సీ/ ఎస్టీ, హిల్ ప్రాంతాల అభ్యర్థులకు 44 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉందని వివరించారు. సమావేశంలో ఎల్‌డీఎం రమణమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం మెప్మా ముద్రించిన ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
వార్డెన్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి
జిల్లాలోని అన్ని సంక్షేమ వసతిగృహాల వార్టెన్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు శుభ్రత, సురక్షిత తాగునీరు, నాణ్యమైన ఆహారం, అవసరమైన సౌకర్యాలు అందించడంతో పాటు, వారి భవిష్యత్తు కోసం మంచి విద్య, కెరీర్ మార్గదర్శకం ఇవ్వాలని సూచించారు. సమీక్ష సమావేశంలో బాలల సంరక్షణ కమిటీ చైర్‌పర్సన్ హిమబిందు, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, సామాజికి సంక్షేమ శాఖ డీడీ వెంకటేశ్వరరావు, డీబీసీడబ్ల్యూఓ జ్యోతిశ్రీ, ఐసీడీఎస్ పీడీ టి.విమల పాల్గొన్నారు.