
పంటదశకు వచ్చినా పూర్తి కాని ఈ క్రాప్..!
● నత్తనడకన సాగుతున్న నమోదు ● జిల్లాలో వరి సాగు 2.42 లక్షల ఎకరాలు
● ఈ–క్రాప్ నమోదు 2.13 లక్షల ఎకరాలు
● మొక్కజొన్న సాగు 24 వేల ఎకరాలు ● ఈ–క్రాప్ నమోదు 12 వేల ఎకరాలు
ఈ–క్రాప్ నమోదుతో ప్రయోజనాలు:
● పంటల బీమా వర్తిస్తుంది
● పంట రుణాలు తీసుకోవచ్చు
● ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందుకోవచ్చు
● పండించిన ధాన్యాన్ని అమ్ముకోవచ్చు.
విజయనగరం ఫోర్ట్: వరిపంట దశకు వచ్చేసింది. కొద్ది రోజుల్లో పంటను కోసేయనున్నారు. అయినప్పటికీ ఈ–క్రాప్ నమోదు పూర్తిస్థాయిలో కాలేదు. ఈ–క్రాప్ నమోదు ఇప్పటికే పూర్తయి సామాజిక తనిఖీ కూడా జరిగిపోవాలి. కాని ఈఏడాది ఈ– క్రాప్ నమోదే ఇంతవరకు పూర్తి కాని పరిస్థితి. ఈ–క్రాప్ నమోదులో జాప్యం వల్ల సామాజిక తనిఖీకి అవకాశం ఉండకపోవచ్చు. దీని వల్ల ఈ–క్రాప్ నమోదులో అవకతవకలు జరిగినప్పటికీ గుర్తించే అవకాశం ఉండదు. ఖాళీగా ఉన్న పంట పొలాల్లో కూడా వరి పంట సాగు చేసినట్లు కొంతమంది ఈ–క్రాప్ నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటివాటిని గుర్తించాలంటే సామాజిక తనిఖీ ద్వారానే సాధ్యం.
ఈ క్రాప్ నదు సాగులో కీలకం
ఈ–క్రాప్ నమోదు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సకాలంలో సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తయ్యేది. కానీ ప్రస్తుతం ఆక్టోబర్ నెల మూడో వారం వచ్చినా ఇంతవరకు ఈ–క్రాప్ నమోదు పూర్తి కాని పరిస్థితి. ఈ–క్రాప్ అధారంగానే 2023వ సంవత్సరం వరకు ప్రభుత్వ పథకాలు అందేవి. అంతేకాకుండా అర్హులకు మాత్రమే పథకాలు అందుతాయి. బినామీలకు అస్కారం ఉండదు. పంట సాగుకు విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, పంటను విక్రయించుకోవాలన్నా, పంటనష్టం జరిగినప్పడు పంటలబీమా పొందాలన్నా ఈక్రాప్ ఉపయోగపడుతుంది.
ఈ–క్రాప్ నమోదు ఇలా
వరి పంట ఖరీఫ్ సీజన్‌లో 2,42 లక్షల ఎకరాల్లో సాౖ గెంది. ఇందులో ఈ–క్రాప్ నమోదు 2.13 లక్షల ఎకరాల్లో పూర్తయింది. మొక్కజొన్న 24 ఎకరాల్లో సాగవగా ఈ–క్రాప్. 12 వేలు ఎకరాల్లో ఈ క్రాప్ నమోదైంది. అలాగే పత్తి 4600 ఎకరాల్లో సాగవగా 4300 ఎకరాల్లో నమోదైంది. చెరుకు పంట 5400 ఎకరాల్లో సాగవగా 3500 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదైంది.
వేగవంతం చేశాం
ఈ–క్రాప్ నమోదును వేగవంతం చేశాం. ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో ఈ–క్రాప్ నమోదు పూర్తి చేస్తాం.
భారతి, జిల్లా వ్యవసాయ అధికారి

పంటదశకు వచ్చినా పూర్తి కాని ఈ క్రాప్..!