బాధిత కుటుంబాలకు..వైఎస్సార్‌సీపీ భరోసా | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలకు..వైఎస్సార్‌సీపీ భరోసా

Oct 18 2025 6:35 AM | Updated on Oct 18 2025 6:35 AM

బాధిత

బాధిత కుటుంబాలకు..వైఎస్సార్‌సీపీ భరోసా

సాక్షి, పార్వతీపురం మన్యం/కురుపాం/గుమ్మలక్ష్మీపురం: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పచ్చకామెర్లతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గిరిజన బాలికలకు వైఎస్సార్‌ సీపీ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. కురుపాం మండలం దండుసూర గ్రామానికి వెళ్లి వారి కుటుంబాలను శుక్రవారం ఓదార్చి, ధైర్యం చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం.. పార్టీ తరఫున తోయక కల్పన, అంజలి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అందజేశారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం ఆశ్రమ పాఠశాల, ఏకలవ్య పాఠశాల విద్యార్థులను మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగా రావు, విశ్వాసరాయి కళావతి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తదితరులతో కలిసి బొత్స పరామర్శించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై తల్లిదండ్రులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా నయమైన తర్వాతనే డిశ్చార్జి చేయాలని వైద్యులకు సూచించారు. వార్డులో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లిన నాయకులు.. త్వరగా తగ్గిపోతుందని ధైర్యం చెప్పారు.

హడావిడిగా డిశ్చార్జి.. గది మార్పు

వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శకు వస్తున్నారన్న సమాచారంతో.. ఎవరి ఆదేశాల ప్రకారమో గానీ, ఆస్పత్రి వైద్యులు గురువారం రాత్రి, శుక్రవారం పలువురు పిల్లలను డిశ్చార్జి చేశారు. ముందు రోజు రాత్రి వరకు ఒక గదిలో ఉంచి, చికిత్స అందించిన పిల్లలందరినీ.. అక్కడ నుంచి హడావిడిగా ఖాళీ చేయించి, ఆస్పత్రిలోని వివిధ వార్డులకు సర్దేశారు. దీంతో పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు.

రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి

పచ్చకామెర్లతో బాధపడుతూ కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు మృతిచెందడం అత్యంత బాధాకరం. ఈ ఘటన కలచివేస్తోంది. కలుషిత నీరు తాగడం వల్ల సుమారు 200 మంది బాలికలు అస్వస్థకు గురై ఆస్పత్రుల్లో చేరడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. ఇద్దరు బాలికలు చనిపోయినా మంత్రుల స్పందించకపోవడం విచారకరం. మృతుల కుటుంబాలకు ఓదార్చుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.5 లక్షలు చొప్పున్న పరిహారం ప్రకటించారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుధ్ధి ఉంటే మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలి.

– బొత్స సత్యనారాయణ,

శాసనమండలి విపక్షనేత

బాధిత కుటుంబాలకు..వైఎస్సార్‌సీపీ భరోసా 1
1/1

బాధిత కుటుంబాలకు..వైఎస్సార్‌సీపీ భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement