
పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు
పాచిపెంట: మండలంలోని పలు పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. అ భివృద్ధి చేస్తే ‘అరుకుకు దీటుగా అందాలు‘ శీర్షికన గత నెల 29వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. మండలంలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని వెలుగు డీపీఎం శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పజెప్పారు. అందులో భాగంగా ధారగెడ్డకు వెళ్లే దారిలో ఉన్న తుప్పలు డొంకలు గురువారం తొలగించారు. ఈ పనులు పర్యవేక్షిస్తున్న వెలుగు ఏపీఎం శ్రీరాములు ‘సాక్షి‘ తో మాట్లాడుతూ త్వరలో రహదారి నిర్మాణం చేపట్టనున్నామని, వాటితోపాటు ప్రత్యక్షంగా పర్యాటకులతో మాట్లాడి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే వెలుగు మహిళా సంఘాల సభ్యులకు లోన్ రూపంలో డబ్బులు మంజూరు చేసి పర్యాటక ప్రదేశాల్లో షాపులు ఏర్పాటు చేయించి పర్యాటకులకు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు