
గిరిజనం గుండెఘోష పట్టదా..?
● ప్రజాసంఘాల నాయకులు
● కలెక్టరేట్ ఎదుట నిరసన
పార్వతీపురం రూరల్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల వరుస మరణాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా? ఇంకెంతమంది విద్యార్థులను నిర్లక్ష్యంతో బలిచేస్తారంటూ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌లు మాట్లాడుతూ గిరిజన విద్యాసంస్థలు విద్యార్థుల పాలిట నిర్లక్ష్యంతో వారి ప్రాణాలను బలిగొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పసిమొగ్గలు పిట్టల్లా రాలిపోతున్నాయని ఈ మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేశారు. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. వసతిగృహాల్లో మెరుగైన సదుపాయాలు, వైద్యసేవలు అందించాలి. మృతిచెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ. 25లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే విద్యార్థుల మరణాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని సురక్షితమైన తాగునీటిని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఇటీవల మృతిచెందిన విద్యార్థుల ఫొటోలు చూపిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వికాస్, బుచ్చి, కార్తీక్, చరణ్, గణేష్, మల్లేష్, చందు, గౌరీశ్వరి, చిన్నారావు, కొందరు తల్లిదండ్రులు, పలు పార్టీల నాయకులు శివప్రసాద్, గౌరీశంకరరావు, ఈవీనాయుడు తదితరులు పాల్గొన్నారు.