
విద్యార్థుల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
● ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ
● సాక్షి కథనానికి స్పందన
పార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించినా..ప్రత్యేక శ్రద్ధ చూపించకపోయినా ఉపేక్షించేది లేదని పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ సంబంధిత అధికారులకు తేల్చి చెప్పారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల బాగోగులు చూడాల్సిన బాధ్యత సంక్షేమ, వైద్యాధికారులపై ఉందని హెచ్చరించారు. గురువారం సాక్షి దినపత్రికలో ‘‘ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అనారోగ్యం’’ శీర్షికన వార్త ప్రచురితం కావడంతో శుక్రవారం ఈ మేరకు పీఓ డోకిశీల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యానికి గురైన విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు, స్థానిక వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని చెప్పారు. ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, విద్యార్థులను ఎప్పటికప్పుడు పరిశీలించి అనుమానంగా ఉంటే రక్తపరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారించాలని స్పష్టం చేశారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు ఆర్.కృష్ణవేణి, మరికొంతమంది అధికారులు పాల్గొన్నారు.