
దొంగతనానికి దారితీసిన జల్సాలు
● చోరీకేసును ఛేదించిన పోలీసులు
రాజాం సిటీ: జల్సాలకు అలవాటుపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్ స్నేహితుల సహాయంతో దొంగతనానికి పాల్పడ్డాడు. జల్సాలు, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు పాల్పడిన ఓ యువకుడు తనకు గతంలో పరిచయమున్న స్నేహితులను ఆశ్రయించి సొంత గ్రామంలో ఏకంగా 18 తులాల బంగారాన్ని చోరీ చేయడంలో సూత్రధారిగా నిలిచాడు. నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడుకాగా మరో స్నేహితుడు ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి రాజాం టౌన్ సర్కిల్ కార్యాలయంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వంగర మండలం బాగెంపేట గ్రామంలో గత నెల 24న పశుమర్తి శంకరరావు ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 25న కేసు నమోదుచేసిన వంగర పోలీసులు ఈ దొంగతనానికి సూత్రధారిగా అదే గ్రామానికి చెదిన రెడ్డి గోపాలకృష్ణను గుర్తించి ఆరా తీశారు. ఆయన ఓ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌తోపాటు జల్సాలకు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఈ ఇబ్బందుల నుంచి ఎలాగైనా బయటపడాలని నిర్ణయించి గతంలో వాలీబాల్ క్రీడలో పరిచయమైన పాలకొండ మండలం యరకారాయపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ బాలరాజు, టీకే రాజపురం గ్రామానికి చెందిన జాడ దుర్గారావులను ఆశ్రయించాడు. గ్రామానికి చెందిన పశుమర్తి శంకరరావు కుటుంబంతో సహా ఇంటికి తాళంవేసి హైదరాబాద్ వెళ్లారని, వారి ఇంట్లో బంగారం సులభంగా దొంగిలించవచ్చునని వారికి తెలియజేశాడు.
16 తులాలు రికవరీ
ఇదే అదునుగా వారు ముగ్గురూ దొంగతనానికి పాల్పడ్డారు. దొంగిలించిన బంగారాన్ని అమ్మకానికి తీసుకువెళ్తున్న నిందితులను బూరాడ జంక్షన్ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకుని వారి నుంచి 18 తులాల బంగారానికి గాను 16 తులాలు రికవరీ చేయగా మిగిలిన రెండు తులాలు బాలరాజు పార్వతీపురంలోని సీఎస్‌బీ బ్యాంకులో తాకట్టుపెట్టాడని, అదికూడా త్వరలో రికవరీ చేస్తామని వెల్లడించారు. సీఐ కె.అశోక్‌కుమార్, వంగర ఎస్సై షేక్‌శంకర్ ఉన్నారు.